ఈ ప్రభుత్వ షేర్లకు మూసివేత షాక్‌?

ఈ ప్రభుత్వ షేర్లకు మూసివేత షాక్‌?

త్వరలో కార్యకలాపాలను మూసివేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వెలువడిన వార్తలు ఈ లిస్టెడ్‌ పీఎస్‌యూ కంపెనీల కౌంటర్లలో అమ్మకాలకు కారణమయ్యాయి. ఇన్వెస్టర్లు ఈ షేర్లను వొదిలించుకునేందుకు ఎగబడటంతో స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌టీసీ ఇండియా), మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్ కార్పొరేషన్‌(ఎంఎంటీసీ) లిమిటెడ్‌ భారీగా పతనమయ్యాయి. ఎస్‌టీసీ ఇండియా, ఎంఎంటీసీ లిమిటెడ్‌లతోపాటు అన్‌లిస్టెడ్‌ కంపెనీ ప్రాజెక్ట్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్‌(పీఈసీ) మూసివేతకు కేంద్ర వాణిజ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మీడియాలో వెలువడిన వార్తలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం..

ఎస్‌టీసీ ఇండియా లిమిటెడ్‌
మూడు పీఎస్‌యూ కంపెనీలు ఎస్‌టీసీ ఇండియా, ఎంఎంటీసీ లిమిటెడ్‌, పీఈసీలను మూసివేసే ప్రతిపాదనలను వాణిజ్య శాఖ కేంద్ర కేబినెట్‌కు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులుకావడంతో ఎస్‌టీసీ ఇండియా, పీఈసీలను మూసివేసేందుకు నిర్ధారిత గడువును సైతం ప్రకటించే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎస్‌టీసీ ఇండియా షేరు 16.3 శాతం కుప్పకూలింది. రూ. 112 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 109 దిగువకూ జారింది. ఈ కౌంటర్లో ఇప్పటివరకూ 9 లక్షలకుపైగా షేర్లు ట్రేడ్‌కావడం గమనార్హం!  

Image result for mmtc ltd

ఎంఎంటీసీ లిమిటెడ్‌
ప్రధానంగా ట్రేడింగ్‌ సేవలందించే ఎంఎంటీసీ లిమిటెడ్‌ కంపెనీ సైతం కార్యకలాపాల నిలిపివేత జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎంఎంటీసీ లిమిటెడ్‌ షేరు 13.3 శాతం పడిపోయింది. రూ. 21.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 21 దిగువకూ చేరింది. ఈ కౌంటర్లో ఇప్పటివరకూ 3.06 మిలియన్‌ షేర్లు చేతులు మారడం గమనించదగ్గ అంశం! ఎస్‌టీసీ ఇండియా, ఎంఎంటీసీ లిమిటెడ్‌లో కేంద్ర ప్రభుత్వానికి 90 శాతం చొప్పున వాటా ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.