ఆయిల్‌ షాక్‌- నేడు భారీ నష్టాలతో?!

ఆయిల్‌ షాక్‌- నేడు భారీ నష్టాలతో?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు పతనంతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 115 పాయింట్లు పడిపోయి 10,996 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. సౌదీఅరేబియా చమురు క్షేత్రాలపై ఆదివారం జరిగిన డ్రోన్‌ దాడుల నేపథ్యంలో ముడిచమురు ధరలు రివ్వున పైకెగశాయి. బ్రెంట్‌, నైమెక్స్‌ చమురు బ్యారల్‌ 10 శాతం స్థాయిలో దూసుకెళ్లాయి. దీంతో సెంటిమెంటుకు షాక్‌ తగిలినట్లు నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద చర్చలపై అంచనాలు, నెలకు 20 బిలియన్‌ యూరోల ఈసీబీ ప్యాకేజీ నేపథ్యంలో వారాంతాన యూరోపియన్‌, అమెరికన్‌ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది.  

చివర్లో కొనుగోళ్ల కిక్‌
ప్రపంచవ్యాప్తంగా బలపడ్డ సెంటిమెంటు కారణంగా శుక్రవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. మిడ్‌సెషన్‌ వరకూ ఆటుపోట్లను చవిచూసినప్పటికీ చివరి అర్ధగంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగమించాయి. వెరసి సెన్సెక్స్‌ 281 పాయింట్లు జంప్‌చేసి 37,385 వద్ద నిలవగా.. నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 11,076 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో 37,000 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌, 11,946 స్థాయిలో నిఫ్టీ కనిష్టాలను చేరాయి. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,986 పాయింట్ల వద్ద, తదుపరి 10,897 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,125 పాయింట్ల వద్ద, తదుపరి 11,174 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,739, 27,380 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,293, 28,486 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు)రూ. 405 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 209 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. బుధవారం రూ. 267 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన ఎఫ్‌పీఐలు గురువారం మరోసారి రూ. 783 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే బుధవారం రూ. 1132 కోట్ల పెట్టుబడులు పెట్టిన డీఐఐలు గురువారం మాత్రం రూ. 127 కోట్ల విలువైన  స్టాక్స్‌ విక్రయించాయి.