ర్యాలీలో.. ప్రధాన రంగాల జోరు

ర్యాలీలో.. ప్రధాన రంగాల జోరు

ఇటీవల ర్యాలీ బాట పట్టిన దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 125 పాయింట్లు పెరిగి 37,271 వద్ద నిలవగా.. నిఫ్టీ 33 పాయింట్లు పుంజుకుని 11,036 వద్ద ముగిసింది. వాణిజ్య వివాద పరిష్కార చర్చలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు తదితర సానుకూల అంశాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. దీంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా లాభాలతోనే ట్రేడయ్యాయి.  

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా  రియల్టీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌ రంగాలు 4.2-2.3 శాతం మధ్య ఎగశాయి. ఐటీ 1.4 శాతం డీలాపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 13 శాతం, టాటా మోటార్స్‌ 11 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఈ బాటలో ఐషర్, మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, వేదాంతా, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ 5-2.6 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఓఎన్‌జీసీ, విప్రో, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ జీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, యూపీఎల్‌, సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్‌ 3.2-1.5 శాతం మధ్య క్షీణించాయి. 
  
ఐడియా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, అదానీ పవర్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, ఈక్విటాస్‌, ఎస్కార్ట్స్‌, యూనియన్‌ బ్యాంక్‌ 8.5-5.5 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ 5 శాతం పతనంకాగా.. ఆయిల్‌ ఇండియా, జస్ట్‌డయల్‌, టాటా గ్లోబల్‌ 3.2-2.2 శాతం మధ్య నీరసించాయి. రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్‌ 10 శాతం దూసుకెళ్లగా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, సన్‌టెక్‌, డీఎల్‌ఎఫ్‌, శోభా, ప్రెస్టేజ్‌, మహీంద్రా లైఫ్‌ 5.7-0.8 శాతం మధ్య ఎగశాయి.

చిన్న షేర్లు గుడ్‌
మార్కెట్లు హుషారుగా ముగిసిన నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1-1.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1845 లాభపడగా.. 777 మాత్రమే నష్టాలతో నిలిచాయి.  

డీఐఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం రూ. 188 విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 686 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం మార్కెట్లకు సెలవుకాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 957 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1207 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.