లాభాల్లోనూ ఈ చిన్న షేర్లు లబోదిబో!

లాభాల్లోనూ ఈ చిన్న షేర్లు లబోదిబో!

ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మధ్య, చిన్నతరహా కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూాపారు. ఫలితంగా ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు భారీ నష్టాలతో కళ తప్పాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా, వరుణ్‌ బెవరేజెస్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, సొమానీ సిరామిక్స్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా: ఐటీ సేవల రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 5.3 శాతం పతనమైంది. రూ. 1965కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 1950 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 9,400 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా  50,000 షేర్లు ట్రేడయ్యాయి.

సొమానీ సిరామిక్స్‌ లిమిటెడ్‌: టైల్స్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 12 శాతం కుప్పకూలింది. రూ. 202కు చేరింది. ఇంట్రాడేలో రూ. 199 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2,500 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 97,500 షేర్లు ట్రేడయ్యాయి. 

వరుణ్‌ బెవరేజెస్‌: పానీయాల రంగ దిగ్గజం పెప్సీకో.. ఫ్రాంచైజీలను నిర్వహించే ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 5.5 శాతం పతనమైంది. రూ. 593కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 575 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3,300కాగా.. చివరి సెషన్‌కల్లా 8500 షేర్లు ట్రేడయ్యాయి. 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌: ప్రయివేట్‌ రంగ ఈ బీమా కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 5 శాతం పతనమైంది. రూ. 421కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 446 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం గమనార్హం. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.77 లక్షలుకాగా.. చివరి సెషన్‌కల్లా 2.06 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.  

డెన్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌: కేబుల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సేవల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 5.5 శాతం పతనమైంది. రూ. 80కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 77 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 42,500కాగా.. చివరి సెషన్‌కల్లా 9500 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి.