డీఎఫ్‌ఎం డౌన్‌- మేఘమణి జోష్‌

డీఎఫ్‌ఎం డౌన్‌- మేఘమణి జోష్‌

సోమవారం ధరతో పోలిస్తే షేర్ల కొనుగోలుకి గ్లోబల్‌ పీఈ సంస్థ యాడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్.. డిస్కౌంట్‌ ధరను ప్రకటించడంతో డీఎఫ్‌ఎం ఫుడ్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఎపిక్లోరోహైడ్రిన్‌ తయారీకి ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో మేఘమణి ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి డీఎఫ్‌ఎం ఫుడ్స్‌ షేరు నష్టాలతో డీలాపడగా.. మేఘమణి ఆర్గానిక్స్‌ కౌంటర్‌ కొనుగోళ్లతో వెలుగులోకి వచ్చింది. వివరాలు చూద్దాం..  

డీఎఫ్‌ఎం ఫుడ్స్‌
డీఎఫ్‌ఎం ఫుడ్స్‌లో మెజారిటీ వాటా 67.9 శాతాన్ని కొనుగోలు చేసేందుకు యూఎస్‌ పీఈ కంపెనీ యాడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొత్తం నగదు రూపేణా కుదిరిన ఈ డీల్‌లో భాగంగా యాడ్వెంట్‌ కార్ప్‌ మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. తద్వారా పబ్లిక్‌ నుంచి ఈ వాటాను సొంతం చేసుకోనుంది. అయితే సోమవారం ముగింపు ధర రూ. 270తో పోలిస్తే రూ. 249.5 ధరను యాడ్వెంట్‌ ప్రకటించింది. తద్వారా 26 శాతం వాటాకు సమానమైన 1.3 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీఎఫ్‌ఎం ఫుడ్స్‌ లిమిటెడ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8.5 శాతం పతనమై రూ. 252 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 249 వరకూ క్షీణించింది.

Image result for meghmani organics limited

మేఘమణి ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌
అనుబంధ సంస్థ మేఘమణి ఫైన్‌కెమ్‌ ద్వారా దేశీయంగా తొలిసారి ఎపిక్లోరోహైడ్రిన్‌ తయారీకి ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు మేఘమణి ఆర్గానిక్స్‌ తాజాగా పేర్కొంది. టెక్నిప్‌ఎఫ్‌ఎంసీకి చెందిన ఎపిసెరోల్‌ టెక్నాలజీ ద్వారా ప్లాంటును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. 50,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో నెలకొల్పనున్న ఈ ప్లాంటుపై రూ. 275 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించింది. తద్వారా ఏడాదికి రూ. 460 కోట్లమేర అదనపు ఆదాయం ఆర్జించే వీలున్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేఘమణి ఆర్గానిక్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 18 శాతంపైగా జంప్‌చేసి రూ. 55.5 వద్ద ట్రేడవుతోంది.