పవర్‌మెక్‌ దూకుడు- సనోఫీ వీక్‌

పవర్‌మెక్‌ దూకుడు- సనోఫీ వీక్‌

దక్షిణ మధ్య రైల్వే, బీహెచ్ఈఎల్ నుంచి నాలుగు కాంట్రాక్టులు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ జోరందుకుంది. కాగా.. మరోవైపు అంకలేశ్వర్‌ యూనిట్‌ను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించిన నేపథ్యంలో విదేశీ ఫార్మా దిగ్గజం సనోఫీ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ షేరు లాభాలతో కళకళలాడుతుంటే.. సనోఫీ ఇండియా కౌంటర్ నష్టాలతో కుదేలయ్యింది. వివరాలు చూద్దాం..

పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌
నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి వర్క్‌ ఆర్డర్లు లభించినట్లు పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. వీటి సంయుక్త విలువ రూ. 275 కోట్లుకాగా.. దక్షిణ మధ్య రైల్వే నుంచి లభించిన రూ. 77 కోట్ల కాంట్రాక్టు కలసి ఉంది. ఈ ఆర్డర్లో భాగంగా హైదరాబాద్‌లోని చర్లపల్లి- ఘట్‌కేసర్ స్టేషన్ల మధ్య పిట్‌ లైన్లు, సర్వీస్‌ బిల్డింగ్, పార్సెల్‌ షెడ్‌, ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ తదితర పనులు చేపట్టవలసి ఉంటుందని కంపెనీ తెలియజేసింది. 18 నెలల్లోగా కాంట్రాక్టును పూర్తి చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ బాటలో బంగ్లాదేశ్‌కు సంబంధించి బీహెచ్‌ఈఎల్‌ నుంచి లభించిన రూ. 198 కోట్ల మూడు ఆర్డర్లను రెండేళ్లలోగా పూర్తిచేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవర్‌మెక్‌ ప్రాజెక్ట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 13 శాతంపైగా దూసుకెళ్లి రూ. 720 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 729 వరకూ ఎగసింది. మౌలిక సదుపాయాల రంగ ఈ కంపెనీలో ప్రమోటర్లకు 62.51% వాటా ఉంది. 

Image result for sanofi india limited

సనోఫీ ఇండియా లిమిటెడ్‌
గుజరాత్‌లోని అంకలేశ్వర్‌ తయారీ ప్లాంటును జెంటివా ప్రయివేట్‌ లిమిటెడ్‌కు విక్రయించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సనోఫీ ఇండియా లిమిటెడ్‌ పేర్కొంది. స్లంప్‌ సేల్‌ పద్ధతిలో ఈ యూనిట్‌ను దాదాపు రూ. 262 కోట్లకు  విక్రయించనున్నట్లు ఫార్మా రంగ గ్లోబల్‌ కంపెనీ సనోఫీ ఇండియా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సనోఫీ ఇండియా షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 6041 వద్ద ట్రేడవుతోంది.