ఇంపాల్‌- టాటా మోటార్స్‌ స్పీడ్‌

ఇంపాల్‌- టాటా మోటార్స్‌ స్పీడ్‌

వాటాదారులకు బోనస్ షేర్లను జారీ చేసేందుకు డైరెక్టర్ల బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో ఆటో విడిభాగాల దిగ్గజం ఇండియన్‌ మోటార్‌ పార్ట్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ లిమిటెడ్‌(IMPAL) కౌంటర్ జోరందుకుంది. కాగా.. మరోపక్క చైనాలో లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ అమ్మకాలలో రికవరీ సాధించినట్లు తెలియజేయడంతో ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఇండియన్‌ మోటార్‌ పార్ట్స్‌ 
కంపెనీ ప్రతిపాదించిన బోనస్ షేర్ల జారీ అంశానికి బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇండియన్‌ మోటార్‌ పార్ట్స్‌(ఇంపాల్‌) తాజాగా వెల్లడించింది. మంగళవారం సమావేశమైన బోర్డు 1:2 నిష్పత్తిలో బోనస్‌ ఇచ్చేందుకు అనుమతించినట్లు తెలియజేసింది. దీంతో వాటాదారుల వద్ద గల ప్రతీ 2 షేర్లకుగాను 1 షేరుని ఫ్రీగా జారీ చేయనుంది. ఇందుకు రికార్డ్‌ డేట్‌ను ప్రకటించవలసి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఇంపాల్‌ షేరు 11 శాతంపైగా దూసుకెళ్లి రూ. 988 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 995 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం గమనార్హం!

టాటా మోటార్స్‌ లిమిటెడ్‌
గత నెల(ఆగస్ట్‌ )లో జేఎల్‌ఆర్‌ వాహన రిటైల్‌ విక్రయాలు చైనాలో రికవర్‌ అయినట్లు టాటా మోటార్స్‌ తాజాగా పేర్కొంది. లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ తయారీ ఆల్‌ న్యూ రేంజ్ రోవర్‌ అమ్మకాలు 51 శాతం జంప్‌చేసినట్లు తెలియజేసింది. వీటిని తొలిసారి చైనాలో ప్రవేశపెట్టగా.. రేంజ్‌ రోవర్ స్పోర్ట్ వాహన విక్రయాలు సైతం 6.4 శాతం పుంజుకున్నట్లు తెలియజేసింది. ఇక జాగ్వార్‌ XJ అమ్మకాలు 31 శాతం ఎగసినట్లు వెల్లడించింది. వెరసి ఆగస్ట్‌లో చైనాలో వాహన అమ్మకాలు 17 శాతంపైగా పెరిగినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది.