ప్రీమియర్‌.. యస్‌ బ్యాంక్‌ హవా

ప్రీమియర్‌.. యస్‌ బ్యాంక్‌ హవా

విక్రయ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌(ఎస్‌ఎస్‌ఎస్‌సీ) నుంచి ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో సోలిడ్‌ ప్రొపెల్లెంట్స్‌ తయారీ సంస్థ ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌ కౌంటర్ జోరందుకుంది. కాగా.. మరోపక్క సహ ప్రమోటర్‌ రాణా కపూర్ వాటాను పేటీఎంకు విక్రయించనున్నట్లు వెలువడిన వార్తల నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌
శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్స్‌కు అవసరమయ్యే PSOM-XI సెగ్మెంట్స్‌(సోలిడ్‌ ప్రొపెల్లెంట్స్‌) తయారీ కోసం వీఎస్‌ఎస్‌సీ నుంచి కాంట్రాక్టును పొందినట్లు ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ పేర్కొంది. గత నెలలో తెలంగాణలోని కాటేపల్లి వద్ద ప్రారంభించిన సాలిడ్‌ ప్రొపెల్లెంట్‌ ప్లాంటులో వీటిని తొలిసారి తయారు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రొడక్టులను ఇప్పటికే SHARకు సరఫరా చేసినట్లు తెలియజేసింది. 2018లో శ్రీహరికోటలో వీటిని విజయవంతంగా పరీక్షించినట్లు తెలియజేసింది. కాగా.. తాజా ఆర్డర్‌ను ఏడాదిన్నరలోగా పూర్తిచేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌ షేరు 14 శాతం దూసుకెళ్లింది. రూ. 191 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 198 వరకూ జంప్‌చేసింది. మిస్సైళ్లకు అవసరమయ్యే సోలిడ్‌ ప్రొపెల్లెంట్స్‌ రూపొందించే ఈ కంపెనీలో ప్రమోటర్లకు 41.13%, వాటా ఉంది.

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
వన్‌97 కమ్యూనికేషన్స్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మకు బ్యాంక్‌ సహ ప్రమోటర్‌ రాణా కపూర్‌ వాటాను విక్రయించనున్న వార్తలను యస్‌ బ్యాంక్‌ తాజాగా ఖండించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌  షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 68 వద్ద ట్రేడవుతోంది. పేటీఎం ప్రమోటర్‌ విజయ్‌తో వాటా విక్రయానికి రాణా కపూర్‌ తొలి దశ చర్చలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కపూర్, సహచర సంస్థలకు యస్‌ బ్యాంక్‌లో ప్రస్తుతం 10.6 శాతం వాటా ఉంది. కాగా.. వీటిలో 7.34 శాతం వాటాను రిలయన్స్‌ నిప్పన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ వద్ద తనఖా ఉంచినట్లు తెలుస్తోంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో వాటా ఉన్న విజయ్‌కు రాణా కపూర్‌ వాటాను విక్రయించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి అనుమతి పొందవలసి ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.