4వ రోజూ.. మెటల్‌, ఆటో అప్‌

4వ రోజూ.. మెటల్‌, ఆటో అప్‌

ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 105 పాయింట్లు లాభపడి 37,250కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 11,040 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపు, సహాయక ప్యాకేజీలవైపు దృష్టిసారించనున్న వార్తలతో మంగళవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ధోరణి నెలకొంది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి.  

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో, ఫార్మా రంగాలు 1.7-0.8 శాతం మధ్య ఎగశాయి. ఐటీ 0.3 శాతం డీలాపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 6 శాతం జంప్‌చేయగా, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతా, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, హీరో మోటో, సన్‌ ఫార్మా, ఎస్‌బీఐ 3.3-1.4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే గెయిల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో,  హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా, కొటక్‌ బ్యాంక్‌ 1.2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.   

ఐడియా ప్లస్
డెరివేటివ్‌ కౌంటర్లలో జిందాల్‌ స్టీల్‌, ఐడియా, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, పిరమల్‌, సెయిల్‌ 5-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క అశోక్‌ లేలాండ్, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, జస్ట్‌డయల్‌, కంకార్‌, బిర్లాసాఫ్ట్‌ 1.6-1 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు గుడ్‌
మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్న నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 802 లాభపడగా.. 283 మాత్రమే నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో స్టార్‌ పేపర్‌, రుచిరా, ఎన్‌ఆర్‌ అగర్వాల్‌,  గోవా కార్బన్‌, ఓరియంట్‌ పేపర్‌, సంగమ్‌, జేకే పేపర్, చెవియట్‌, వెస్ట్‌కోస్ట్‌ పేపర్, ఇండియన్‌ హ్యూమ్‌పైప్‌, ఇండియా గ్లైకాల్‌ తదితరాలు 18-7 శాతం మధ్య జంప్‌ చేశాయి.