యూఎస్‌ ఫ్లాట్‌- ఫాస్ట్‌ఫుడ్స్‌ వీక్‌

యూఎస్‌ ఫ్లాట్‌- ఫాస్ట్‌ఫుడ్స్‌ వీక్‌

ఇండస్ట్రియల్‌, ఎనర్జీ రంగాలు పుంజుకున్నప్పటికీ టెక్నాలజీ, రియల్టీ రంగాలు డీలాపడటంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. డోజోన్స్ 74 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 26,909కు చేరగా.. ఎస్‌అండ్‌పీ సైతం నామమాత్రంగా 1 పాయింట్‌(0.01 శాతం) బలపడి 2,979 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మాత్రం 3 పాయింట్లు(0.04 శాతం) క్షీణించి 8,084 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా మూడో రోజు మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలోనే ట్రేడయ్యాయి. కాగా.. ఆర్థిక మందగమన పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ), ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు సహాయక ప్యాకేజీలను అమలు చేయడం ద్వారా మాంద్య పరిస్థితులను తట్టుకోనున్నట్లు జర్మన్‌ ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రకటించింది. 

Image result for Apple inc

యాపిల్‌ ఇంక్‌ ప్లస్‌
స్ట్రీమింగ్‌ సర్వీసుల యాపిల్‌ టీవీ, ఐఫోన్‌ 11, యాపిల్‌ వాచీ అప్‌డేట్స్‌ను నవంబర్‌లో విడుదల చేయనున్న వార్తలతో యాపిల్‌ ఇంక్‌ 1.2 శాతం పుంజుకుంది. కాగా.. 2019 పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలు నిరాశ పరచడంతో ఫాస్ట్‌ ఫుడ్‌ చైన్‌ కంపెనీ వెండీస్‌ కో 10 శాతంపైగా కుప్పకూలింది. సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌ సంస్థ ఎప్రెంటీను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మెక్‌డొనాల్డ్స్‌ ఇంక్‌ షేరు సైతం 3.5 శాతం పతనమైంది. ఇక మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఆటో దిగ్గజం ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ 1.3 శాతం క్షీణించింది. మిడ్‌ క్యాప్స్‌లో మాలిన్‌క్రాక్ట్‌ పీఎల్‌సీ 85 శాతం దూసుకెళ్లింది. అనుబంధ సంస్థ బయోవెక్ట్రా ఇంక్‌ను పీఈ సంస్థ హెచ్‌ఐజీ క్యాపిటల్‌కు 25 కోట్ల డాలర్లకు విక్రయించనున్నట్లు ప్రకటించడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో స్పెషాలిటీ రిటైలర్‌ ఫ్రాన్సెస్కాస్‌ హోల్డింగ్స్‌ 102 శాతం ఎగసింది.

Image result for ford motor company

లాభాల్లో
మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, జర్మనీ 0.4 శాతం చొప్పున పుంజుకోగా, ఫ్రాన్స్‌ యథాతథంగా నిలిచింది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. హాంకాంగ్‌ 1.6 శాతం జంప్‌చేయగా, కొరియా, జపాన్‌, సింగపూర్‌ 0.8-0.6 శాతం మధ్య ఎగశాయి. మిగిలిన మార్కెట్లలో తైవాన్‌, థాయ్‌లాండ్‌ 0.2 శాతం పుంజుకోగా.. చైనా 0.2 శాతం నీరసించింది. ఇండొనేసియా నామమాత్ర నష్టంతో ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడటంతో 10 ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ నెల రోజుల గరిష్టం 1.745 శాతానికి ఎగశాయి. డాలరు ఇండెక్స్‌ 98.40కు చేరగా.. యూరో 1.104కు, జపనీస్‌ యెన్‌ 107.58కు బలహీనపడ్డాయి.