లాభాల ఒపెనింగ్‌ నేడు?!

లాభాల ఒపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రోత్సాహకరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 50 పాయింట్లు ఎగసి 11,020 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. మంగళవారం మొహర్రం సందర్భంగా దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. ఎనర్జీ, ఇండస్ట్రియల్‌ షేర్ల అండతో యూఎస్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈ బాటలో యూరోపియన్‌, ఏషియన్‌ మార్కెట్లు సైతం సానుకూల ధోరణి కనబరిచాయి. మూడు రోజులు దేశీయంగానూ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో పురోగమిస్తున్నాయి. దీంతో నేడు కొంతమేర కన్సాలిడేషన్‌ కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

చివరికి వరకూ నిలిచాయ్‌
విదేశీ గణాంకాల నిరాశ నేపథ్యంలో సోమవారం నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 164 పాయింట్లు పెరిగి 37,145 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 57 పాయింట్లు ఎగసి 11,003 వద్ద స్థిరపడింది. వెరసి ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 37,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌లను అధిగమించి నిలిచాయి. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,919 పాయింట్ల వద్ద, తదుపరి 10,835 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,058 పాయింట్ల వద్ద, తదుపరి 11,113 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,144, 26,783 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 27,715, 27,926 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం రూ. 188 విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 686 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం మార్కెట్లకు సెలవుకాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 957 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1207 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.