చివరికి వరకూ నిలిచాయ్‌!

చివరికి వరకూ నిలిచాయ్‌!

విదేశీ గణాంకాల నిరాశ నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 164 పాయింట్లు పెరిగి 37,145 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 57 పాయింట్లు ఎగసి 11,003 వద్ద స్థిరపడింది. వెరసి ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 37,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌లను అధిగమించి నిలిచాయి. ఆగస్ట్‌లో అమెరికా వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు, ఏప్రిల్‌-జూన్‌లో జపనీస్‌ జీడీపీ వృద్ధి అంచాలను అందుకోకపోగా.. గత నెలలో చైనీస్‌ ఎగుమతులు క్షీణించాయి. ఫలితంగా మరోసారి ప్రపంచ ఆర్థిక మందగమన అంచనాలు పెరిగాయి. దీంతో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపువైపు దృష్టిసారించవచ్చన్న అంచనాలు బలపడుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియల్టీ రంగాలు 1-0.5 శాతం మధ్య పుంజుకోగా.. ఐటీ 0.7 శాతం డీలాపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, మారుతీ, ఎల్‌అండ్‌టీ, ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో 4.3-1.5 శాతం మధ్య పెరిగాయి. అయితే హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐషర్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, ఐబీ హౌసింగ్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ 1.4-0.6 శాతం మధ్య నీరసించాయి. 

ఎంసీఎక్స్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎంసీఎక్స్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్‌, టాటా పవర్‌, ఎన్‌బీసీసీ, జస్ట్‌ డయల్‌, మణప్పురం, దివాన్‌ హౌసింగ్‌, ముత్తూట్‌ ఫైనాన్స్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 10.4-4 శాతం మధ్య  జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఈక్విటాస్‌ 7 శాతం పతనంకాగా, గ్లెన్‌మార్క్‌, అశోక్ లేలాండ్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, బయోకాన్‌, టొరంట్ ఫార్మా, హెక్సావేర్‌, ఉజ్జీవన్‌ 2-1.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు హుషారుగా ట్రేడైన నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1602 లాభపడగా.. 934 మాత్రమే నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) వారాంతాన రూ. 957 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1207 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 561 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 699 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.