రిలాక్సో రికార్డ్‌- ఎవరెడీ బోర్లా

రిలాక్సో రికార్డ్‌- ఎవరెడీ బోర్లా

ఇటీవల కొద్ది రోజులుగా లాభాల బాటలో సాగుతున్న రిలాక్సో ఫుట్‌వేర్స్‌ కౌంటర్‌ మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. దీంతో ఈ కౌంటర్‌ సరికొత్త గరిష్టాన్ని అందుకుని.. లాభాలతో కళకళలాడుతుంటే.. స్లంప్‌ సేల్‌ పద్ధతిలో బ్యాటరీ, ఫ్లాష్‌లైట్ల బిజినెస్‌లు విక్రయించనున్నట్లు వెలువడిన వార్తలు ఎవరెడీ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలకు కారణమయ్యాయి. వెరసి ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో అంతా అమ్మేవాళ్లే మిగలడంతో లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం..

రిలాక్సో ఫుట్‌వేర్స్‌ లిమిటెడ్‌
మూడు రోజులుగా లాభాల బాటలో సాగుతున్న ఫుట్‌వేర్‌ ప్రొడక్టుల తయారీ, మార్కెటింగ్‌ నిర్వహించే రిలాక్సో ఫుట్‌వేర్  షేరు మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.4 శాతం ఎగసి రూ. 495 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 514 వరకూ జంప్‌చేసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత మూడు రోజుల్లోనూ ఈ షేరు 7 శాతం పుంజుకుంది. నెల రోజుల్లో 13 శాతం ర్యాలీ చేసింది. ఈ కౌంటర్లో రెండు వారాల సగటు 3200 షేర్లుకాగా.. నేటి ట్రేడింగ్‌లో 12,000 షేర్లకుపైగా ట్రేడయ్యాయి.

Image result for eveready industries

ఎవరెడీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
యూఎస్‌ కంపెనీ డ్యురాసెల్‌ ఇంక్‌ స్లంప్‌ సేల్‌ పద్ధతిలో బ్యాటరీలు, ఫ్లాష్‌ లైట్ల విభాగాలను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తల నేపథ్యంలో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ డీలాపడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమైంది. రూ. 70.50 వద్ద ఫ్రీజయ్యింది. డీల్‌లో భాగంగా తయారీ ప్లాంట్లు, పంపిణీ నెట్‌వర్క్‌, ఎవరెడీ బ్రాండ్లను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎవరెడీ రూ. 1600-1700 కోట్లను సమకూర్చుకునే వీలున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఎవరెడీ కౌంటర్లో 2.5 లక్షల షేర్లు చేతులు మారాయి. గత రెండు వారాల సగటు 5900 షేర్లు మాత్రమే.