కాఫీడే.. సికాల్‌- శంకర.. దూకుడు

కాఫీడే.. సికాల్‌- శంకర.. దూకుడు

రవాణా, లాజిస్టిక్స్‌ సేవల కంపెనీలో సికాల్‌ లాజిస్టిక్స్‌లో గల వాటాను విక్రయించేందుకు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ నిర్ణయించుకున్నట్లు వెలువడిన వార్తలు ఈ రెండు కౌంటర్లకూ జోష్‌నిస్తున్నాయి. కాగా.. మరోపక్క ఇటీవల జోరు చూపుతున్న శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్‌ సైతం మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో కేఫ్‌ కాఫీ డే స్టోర్ల కంపెనీ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, సికాల్‌ లాజిస్టిక్స్‌ అప్పర్‌ సర్క్యూట్లను తాకగా.. శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్‌ సైతం భారీ లాభాలతో దూకుడు చూపుతోంది. వివరాలు చూద్దాం..

Image result for Coffee day and sical logistics

కాఫీ డే- సికాల్‌ లాజిస్టిక్స్‌
ప్రమోటర్‌ వీజీ సిద్ధార్థ మరణం తదుపరి రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలు అమలు చేస్తున్న కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా మరో ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. సికాల్‌ లాజిస్టిక్స్‌లో ఉన్న వాటాను విక్రయించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 1,000-1500 కోట్లవరకూ సమకూర్చుకునే వీలున్నట్లు అంచనా. సికాల్‌లో వాటా విక్రయాన్ని నిర్వహించేందుకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు కేఫ్‌ కాఫీ డే స్టోర్ల నిర్వాహక సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌, ఇటు సికాల్‌ లాజిస్టిక్స్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 64 వద్ద నిలిచింది. ఈ బాటలో సికాల్‌ లాజిస్టిక్స్‌ షేరు సైతం 5 శాతం ఎగసి రూ. 27 వద్ద ఫ్రీజయ్యింది.

Image result for shankara building products

శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌
ఇటీవల జోరు చూపుతున్న హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్ ఉత్పత్తుల కంపెనీ శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్లో ఇన్వెస్టర్లు మరోసారి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం శంకర బిల్డ్‌ షేరు దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. రూ. 433 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 435 వరకూ ఎగసింది. వెరసి గత నాలుగు రోజుల్లో ఈ షేరు 67 శాతం జంప్‌ చేసింది. ఈ నెల 3న శంకర బిల్డ్‌ షేరు రూ. 258 వద్ద ట్రేడయ్యింది. కాగా.. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 35,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 1.9 లక్షలకుపైగా షేర్లు చేతులు మారడం విశేషం!