రుచీ సోయాకు కిక్‌- సొమానీ పతనం

రుచీ సోయాకు కిక్‌- సొమానీ పతనం

ఎఫ్‌ఎంసీజీ కంపెనీ పతంజలి గ్రూప్‌ ప్రతిపాదించిన రుణ విమోచన(డెట్‌ రిజల్యూషన్‌) పథకానికి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అనుమతించిన వార్తలతో వంట నూనెల కంపెనీ రుచీ సోయా ఇండస్ట్రీస్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కౌంటర్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. కాగా.. మరోపక్క సిరామిక్‌ టైల్స్‌ తయారీ కంపెనీ సొమానీ సిరామిక్స్‌ కౌంటర్లో లావాదేవీలు భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఈ షేరు లోయర్ సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం..

రుచీ సోయా ఇండస్ట్రీస్‌
ఎఫ్‌ఎంసీజీ రంగ పతంజలి గ్రూప్‌ ప్రతిపాదించిన కొన్ని మార్పులతోకూడిన డెట్‌ రిజల్యూషన్‌ పథకానికి ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లడికావడంతో రుచీ సోయా ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 4.5 శాతం పెరిగి రూ. 4.80 వద్ద ఫ్రీజయ్యింది. రుణ విమోచన పథకంలో భాగంగా పతంజలి గ్రూప్‌ రూ. 205 కోట్లను ఈక్విటీగా, రూ. 3233 కోట్లను రుణాలుగా రుచీ సోయాకు అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మార్పిడికి వీలుకాని డిబెంచర్లు, ప్రిఫరెన్స్‌ షేర్ల ద్వారా రూ. 900 కోట్లను సైతం పతంజలి కన్సార్షియం ఆధిగ్రహణ్‌ ద్వారా  ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తదుపరి దశలో రుచీ సోయాలో పతంజలి కన్సార్షియంను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. స్టేట్‌బ్యాంక్‌ తదితర బ్యాంకుల కన్సార్షియంకు రుచీ సోయా రూ. 9350 కోట్లవరకూ రుణాలను చెల్లించవలసి ఉన్న విషయం విదితమే.

Image result for somany ceramics limited

సొమానీ సిరామిక్స్‌ లిమిటెడ్‌
ఉన్నట్టుండి టైల్స్‌ తయారీ కంపెనీ సొమానీ సిరామిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకావడవంతో ప్రస్తుతం ఈ షేరు రూ. 57 పతనమై రూ. 229 దిగువన ఫ్రీజయ్యింది. తొలి రెండు గంటల్లోనే ఈ కౌంటర్లో 20,000 షేర్లు చేతులు మారడం గమనార్హం. గత ఐదు రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 950 షేర్లతో పోలిస్తే ట్రేడింగ్‌ పరిమాణం 1950 శాతం పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. గత మూడు నెలల్లో ఈ షేరు 46 శాతం విలువను కోల్పోయింది!