4వ రోజూ రుపీ జోరు

4వ రోజూ రుపీ జోరు

వరుసగా నాలుగో రోజు దేశీ కరెన్సీ రికవరీ బాటలో సాగుతోంది. డాలరుతో మారకంలో రూపాయి తొలుత శుక్రవారం ముగింపు 71.72 వద్దే యథాతథంగా ప్రారంభమైంది. తదుపరి ఊపందుకుంది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్ మార్కెట్లో 17 పైసలు పుంజుకుని 71.55 వద్ద ట్రేడవుతోంది. ఈక్విటీ మార్కెట్లు జోరందుకున్న నేపథ్యంలో వారాంతాన వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ లాభాల బాటలో సాగింది. శుక్రవారం 12 పైసలు బలపడి 71.72 వద్ద ముగిసింది. వెరసి మూడు రోజుల్లో 67 పైసలు జమచేసుకుంది. కాగా.. రూపాయి గత గురువారం(5న) 28 పైసలు ఎగసి 71.84 వద్ద నిలవగా.. అంతకుముందు బుధవారం సైతం 27 పైసలు జమ చేసుకుని 72.12 వద్ద స్థిరపడిన విషయం విదితమే. అయితే మంగళవారం(3న) రూపాయి ఏకంగా 97 పైసలు(1 శాతం) పతనమై 72.39 వద్ద ముగిసింది. ఇది 2018 నవంబర్‌ 13 తదుపరి కనిష్టంకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి చేరడం సెంటిమెంటును బలహీనపరచినట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. 

ఈ నెలలోనూ..
దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధికంగా అమ్మకాలు చేపడుతున్నారు. ఈ నెల(సెప్టెంబర్‌)లో ఇంతవరకూ(3-6) ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో నికరంగా రూ. 4264 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అయితే మరోపక్క డెట్‌ సెక్యూరిటీలలో మాత్రం 3,001 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. కాగా.. ఆగస్ట్‌లోనూ ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో భారీగా రూ. 17,592 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. జులైలోనూ ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 14,383 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.