శిల్పా జూమ్‌- ఈక్విటాస్‌ డౌన్‌ 

శిల్పా జూమ్‌- ఈక్విటాస్‌ డౌన్‌ 

తెలంగాణలోని జడ్చర్లలోగల ప్లాంటులో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు పూర్తియినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్ కంపెనీ శిల్పా మెడికేర్ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోవైపు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ విభాగం లిస్టింగ్‌ అంశంలో గడువు పెంచేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ తిరస్కరించిన వార్తలతో ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి శిల్పా మెడికేర్ కౌంటర్‌ లాభాలతో కళకళలాడుతుంటే.. ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ నేలచూపులతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

శిల్పా మెడికేర్ లిమిటెడ్‌
జడ్చర్లలోగల ఫినిష్‌డ్‌ డోసేజీ ఫార్ములేషన్ల తయారీ ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ రెండు లోపాలను గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్‌) శిల్పా మెడికేర్ తాజాగా పేర్కొంది. ఆగస్ట్‌ 29- సెప్టెంబర్‌ 6 మధ్య యూఎస్‌ఎఫ్‌డీఏ ఈ ప్లాంటులో తనిఖీలు నిర్వహించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో శిల్పా మెడికేర్‌ షేరు 5 శాతంపైగా జంప్‌చేసి రూ. 273 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 274 వరకూ ఎగసింది.

Image result for equitas holdings ltd

ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌
స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌ విభాగాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌ చేసేందుకు వీలుగా అదనపు గడువును మంజూరు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ నిరాకరించిందని ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రివర్స్‌ మెర్జర్‌కు నో చెప్పినట్లు తెలియజేసింది. దీంతో ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌(ESFB) లిస్టింగ్‌కు సరికొత్త ప్రతిపాదనను రూపొందించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ షేరు 4.5 శాతం పతనమై రూ. 111 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 102 వరకూ క్షీణించింది.