నష్టాలతో షురూ.. ఫార్మా ఓకే

నష్టాలతో షురూ.. ఫార్మా ఓకే

విదేశీ గణాంకాలు నిరుత్సాహపరచిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 151 పాయింట్లు క్షీణించి 36,831కు చేరగా.. నిఫ్టీ 52 పాయింట్ల వెనకడుగుతో 10,894 వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌లో అమెరికా వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు, చైనీస్‌ ఎగుమతులు నీరసించగా.. ఏప్రిల్‌-జూన్‌లో జపనీస్‌ జీడీపీ వృద్ధి అంచాలను చేరలేదు. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. దేశీయంగా జీడీపీ, ఆటో విక్రయాలు మందగించడం సెంటిమెంటును బలహీనపరచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఆటో, బ్యాంకింగ్ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఆటో, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగాలు 1.5-0.8 శాతం మధ్య క్షీణించగా.. ఫార్మా 0.5 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, మారుతీ, ఐషర్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్‌ఇండ్, వేదాంతా, హెచ్‌సీఎల్‌ టెక్‌, జీ 2-1 శాతం మధ్య నీరసించాయి. అయితే యూపీఎల్‌, సన్‌ ఫార్మా, ఐబీ హౌసింగ్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌ 2-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. 

ఈక్విటాస్‌ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఈక్విటాస్ 6.3 శాతం పతనంకాగా.. అశోక్‌ లేలాండ్‌, సెయిల్‌, ఉజ్జీవన్‌ 2 శాతం చొప్పున డీలాపడ్డాయి. కాగా.. ఎన్‌బీసీసీ, ఎంసీఎక్స్‌, యూపీఎల్‌, రిలయన్స్‌ కేపిటల్‌, సన్‌ ఫార్మా, బీఈఎల్‌, అమరరాజా, జస్ట్‌ డయల్‌, టాటా ఎలక్సీ, బాటా 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. 

చిన్న షేర్లు ఫ్లాట్‌
మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమైన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ ఇండెక్సులు నామమాత్రంగా లాభపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 656 లాభపడగా.. 528 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో అపోలో, శంకర, గుజరాత్‌ అపోలో, వివిమెడ్‌, ఎన్‌ఏసీఎల్‌, రాయల్‌ ఆర్కిడ్‌, ఎస్‌సీఐ, సంగమ్‌, ఎమ్‌కే, కాఫీ డే, రిలాక్సో తదితరాలు 13-5 శాతం మధ్య ఎగశాయి.