గణాంకాలు డీలా- యూఎస్‌ ఫ్లాట్‌

గణాంకాలు డీలా- యూఎస్‌ ఫ్లాట్‌

వ్యవసాయేతర రంగంలో ఆగస్ట్‌ నెలకు ఉపాధి గణాంకాలు 1.3 లక్షలకు పరిమితంకావడంతో మళ్లీ సెంటిమెంటు బలహీనపడింది. వరుసగా రెండో నెలలోనూ ఉద్యోగ సృష్టి మందగించడంతో ఇన్వెస్టర్లు నిరాశచెందినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో అమెరికా, చైనా మధ్య అత్యున్నత స్థాయిలో వాణిజ్య వివాద చర్చలు ప్రారంభంకాగలవన్న హుషారు ఆవిరైనట్లు వ్యాఖ్యానించారు. వెరసి వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. డోజోన్స్ 69 పాయింట్లు(0.25 శాతం) పుంజుకుని 26,797కు చేరగా.. ఎస్‌అండ్‌పీ సైతం నామమాత్రంగా 3 పాయింట్లు(0.01 శాతం) బలపడి 2,979 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మాత్రం 14 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 8,103 వద్ద స్థిరపడింది. అయితే వారం మొత్తంగా చూస్తే మార్కెట్లు లాభాలతో నిలిచాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 1.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. నాస్‌డాక్‌ 1.8 శాతం ఎగసింది. 

Image result for lands end logo

లులులెమన్‌ జోరు
త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో దుస్తుల కంపెనీ లులులెమన్‌ షేరు 7 శాతం జంప్‌చేసింది. తొలుత 15 శాతం వరకూ దూసుకెళ్లింది. ఇతర రిటైల్‌ కంపెనీలలో ల్యాండ్స్‌ ఎండ్‌ 2.5 శాతం పుంజుకోగా..  సైనెట్‌ జ్యువెలరీ 4 శాతం ఎగసింది. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో జపనీస్‌ జీడీపీ 1.3 శాతమే వృద్ధి చూపింది. విశ్లేషకుల అంచనాలు 1.8 శాతంకంటే ఇది తక్కువకాగా.. ఆగస్ట్‌లో చైనీస్‌ ఎగుమతులు అనూహ్యంగా క్షీణించాయి. 1 శాతం వెనకడుగు వేశాయి. ఆర్థికవేత్తలు 2 శాతం పురోగతిని అంచనా వేయడం గమనార్హం! వాణిజ్య వివాదాలు ప్రభావం చూపినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.

లాభాల్లో
శుక్రవారం యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్‌ 0.15 శాతం చొప్పున పుంజుకోగా, జర్మనీ 0.55 శాతం ఎగసింది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. కొరియా, జపాన్‌, చైనా 0.6 శాతం చొప్పున లాభపడగా.. ఇండొనేసియా, తైవాన్‌, సింగపూర్‌ 0.2 శాతం చొప్పున బలపడ్డాయి. మిగిలిన మార్కెట్లలో హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌ స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. పరిస్థితుల కారణంగా 10 ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 1.6 శాతం నుంచి 1.56 శాతానికి వెనకడుగు వేశాయి. డాలరు ఇండెక్స్‌ 98.46కు చేరగా.. యూరో 1.102కు నామమాత్రంగా బలహీనపడింది. జపనీస్‌ యెన్‌ స్వల్పంగా 106.97కు బలపడింది.