సానుకూల ఒపెనింగ్‌- తదుపరి?!

సానుకూల ఒపెనింగ్‌- తదుపరి?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 10,974 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఏడాది కాలంగా కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు చెక్‌ పెట్టేందుకు అక్టోబర్‌లో చర్చలు చేపట్టనున్నట్లు చైనా ప్రకటించడంతో వారాంతాన మరోసారి యూరప్‌, అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా బలపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీయంగానూ గత రెండు రోజులుగా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో పురోగమిస్తున్నాయి. అయితే నేడు తిరిగి కొంతమేర కన్సాలిడేషన్‌ కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

37,000కు సెన్సెక్స్‌
ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో వారాంతాన ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ పటిష్టంగా ట్రేడయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే అధిక శాతం మొగ్గు చూపడంతో సెన్సెక్స్‌ 337 పాయింట్లు జంప్‌చేసి 36,982 వద్ద ముగిసింది. మిడ్‌సెషన్‌లో లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేయడం ద్వారా 37,000 పాయింట్ల మార్క్‌ను సైతం అందుకుంది. ఈ బాటలో నిఫ్టీ సైతం 98 పాయింట్లు ఎగసి 10,946 వద్ద నిలిచింది. ఒక దశలో 10,957 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,890 పాయింట్ల వద్ద, తదుపరి 10,834 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,980 పాయింట్ల వద్ద, తదుపరి 11,013 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,028, 26,809 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 27,389, 27,530 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) వారాంతాన రూ. 957 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1207 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 561 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 699 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.