ఆటుపోట్ల మధ్య చివరికి నష్టాలే

ఆటుపోట్ల మధ్య చివరికి నష్టాలే

గడిచిన వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య చివరికి నష్టాలతో ముగిశాయి. వాణిజ్య వివాద పరిష్కార చర్చలు చేపట్టేందుకు అమెరికా, చైనా మధ్య సయోధ్య కుదరడంతో వారాంతాన ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. దీంతో చివరి రెండు రోజుల్లోనూ అమెరికాసహా ఆసియావరకూ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ప్రభావంతో దేశీయంగానూ మార్కెట్లు బౌన్స్‌ అయినప్పటికీ నికరంగా నష్టాలే మిగిలాయి. సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. గత వారం(3-6) నికరంగా సెన్సెక్స్‌ 351 పాయింట్లు(1 శాతం) నష్టపోయింది. 36,982 వద్ద ముగిసింది. వారం చివర్లో 37,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ 77 పాయింట్లు(0.7 శాతం) తక్కువగా 10,946 వద్ద స్థిరపడింది.

మిడ్‌ క్యాప్స్‌ సైతం
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ డీలా పడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 103 పాయింట్లు(0.8 శాతం) నీరసించి 13,365 వద్ద నిలవగా.. స్మాల్‌ క్యాప్‌ 60 పాయింట్లు(0.5 శాతం) వెనకడుగుతో 12,595 వద్ద స్థిరపడింది. 

డాక్టర్‌ రెడ్డీస్‌ జోరు
బ్లూచిప్స్‌లో గత వారం డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, ఐవోసీ, హీరో మోటో 7-3 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐబీ హౌసింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ ఫార్మా, ఏషియన్ పెయింట్స్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌, అల్ట్రాటెక్‌, టైటన్‌, హెచ్‌యూఎల్‌, జీ 7-3 శాతం మధ్య క్షీణించాయి.

శంకర.. శంకర
గత వారం మిడ్‌ క్యాప్స్‌లో శంకర బిల్డ్‌ 40 శాతం దూసుకెళ్లగా.. సీజీ పవర్‌, నవకార్‌, ఎస్‌సీఐ, లక్స్‌, రెయిన్, అవంతీ, బాంబే బర్మా, జాగరణ్‌, హెరిటేజ్ 21-8 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు కాఫీ డే, ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా, ఓబీసీ, ఒబెరాయ్‌, మ్యాగ్మా, ఎంసీఎక్స్‌, కార్పొరేషన్ బ్యాంక్‌, వీఐపీ, సెంట్రమ్‌, డీఎల్‌ఎఫ్‌, పీఈఎల్‌, యూనియన్‌ బ్యాంక్, స్పార్క్‌ 18-7 శాతం మధ్య పతనమయ్యాయి.