డేటావైపు.. మార్కెట్ల చూపు

డేటావైపు.. మార్కెట్ల చూపు

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి  గణాంకాలపై దృష్టిపెట్టనుంది. వీటికితోడు అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య వివాద అంశాలు సైతం ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆగస్ట్‌ నెలకు ద్రవ్యోల్బణం, జులై నెలలో పారిశ్రామికోత్పత్తి ప్రగతికి సంబంధించిన గణాంకాలు గురువారం(12న) విడుదలకానున్నాయి. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకుల విలీనం, కొత్త పెట్టుబడుల వివరాలను ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకింగ్‌ కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి. మరోవైపు ఏప్రిల్‌-జూన్‌ కాలంలో దేశ జీడీపీ 5 శాతమే వృద్ధి సాధించడంతో ఇన్వెస్టర్లలో ఆర్థిక మందగమన ఆందోళనలు నెలకొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

నాలుగు రోజులే ట్రేడింగ్‌
మంగళవారం(10న) మొహర్రం సందర్భంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. గత కొద్ది రోజులుగా కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి గత వారం జోరందుకున్నాయి. ఇటీవల కరెక్షన్‌కు లోనైన మెటల్, ఆటో రంగాలు కొనుగోళ్లతో కళకళలాడాయి. 

Image result for trump and jinping

విదేశీ మార్కెట్లు కీలకం
గత వారం చివర్లో అమెరికా, చైనా మధ్య సయోధ్య కుదరడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. దీంతో అమెరికాసహా ఆసియావరకూ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. అక్టోబర్‌లో ఈ రెండు దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో వాణిజ్య వివాద పరిష్కారానికి చర్చలు జరగనున్నట్లు ఆయా దేశాల వాణిజ్య శాఖలు ప్రకటించాయి. ఇతర విదేశీ అంశాల విషయానికివస్తే.. ఆగస్ట్‌ నెలకు వ్యవసాయేతర రంగంలో ఉపాధి గణాంకాలు నీరసించినట్లు అమెరికా వారాంతాన వెల్లడించింది. సోమవారం(9న) ఏప్రిల్‌-జూన్‌ కాలానికి జపనీస్‌ జీడీపీ ద్వితీయ అంచనాలు వెలువడనున్నాయి. ఆగస్ట్‌ నెలకు చైనా ద్రవ్యోల్బణ వివరాలు 10న తెలియనున్నాయి. ఆగస్ట్‌ నెలకు యూఎస్‌ రిటైల్ అమ్మకాలు శుక్రవారం(13న) విడుదలకానున్నాయి. ఇలాంటి పలు అంశాలు సైతం ఇన్వెస్టర్లు పరిశీలించే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రాధాన్య అంశాలు..
ముడిచమురు ధరలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు.. ప్రభుత్వ విధానాలు వంటి పలు ఇతర అంశాలు సైతం మార్కెట్లలో ట్రెండ్‌కు కీలకంగా నిలిచే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.