డేటామాటిక్స్‌- కెపాసైట్‌ జూమ్‌

డేటామాటిక్స్‌- కెపాసైట్‌ జూమ్‌

బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(బీఐఏఎల్‌) నుంచి ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో డేటామాటిక్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కౌంటర్ జోరందుకుంది. కాగా.. మరోపక్క మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్‌ లభించినట్లు తెలియజేయడంతో నిర్మాణ రంగ కంపెనీ కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

డేటామాటిక్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ 
డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ భాగస్వామిగా సేవలందించేందుకు బీఐఏఎల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డేటామాటిక్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పేర్కొంది. తద్వారా ఆర్గనైజేషన్‌లోగల 170కుపైగా ప్రాసెస్‌లను ఆటోమేటింగ్‌, డిజిటైజింగ్‌ చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. క్లౌడ్‌ ఆధారిత సొల్యూషన్‌లో భాగంగా సమీకృత డాక్యుమెంట్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్ సేవలను అభివృద్ధి చేయవలసి ఉంటుందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డేటామాటిక్స్‌ షేరు ఎన్‌ఎస్ఈలో 7.5 శాతం జంప్‌చేసి రూ. 81 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 84ను సైతం అధిగమించింది.

Image result for capacite infraprojects ltd logo

కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌
మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పట్టణ, పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌(సీఐడీసీవో) నుంచి రూ. 4502 కోట్ల విలువైన కాంట్రాక్ట్ లభించినట్లు కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఆర్డర్‌లో భాగంగా నవీముంబైలో 21,346 డ్వెల్లింగ్ యూనిట్లతోపాటు.. వాణిజ్య ప్రాతిపదికన కొంతమేర భూమిని అభివృద్ధి చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో కెపాసైట్‌ ఇన్‌ఫ్రా షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 208 వద్ద ట్రేడవుతోంది. తొలుత దాదాపు 10 శాతం దూసుకెళ్లి రూ. 219 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.