భళా.. ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, జేకుమార్‌

భళా.. ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, జేకుమార్‌

విదేశీ రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ కంపెనీ షేర్ల రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో విద్యుత్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజాలు రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) లిమిటెడ్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) లిమిటెడ్‌ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. కాగా.. మరోపక్క మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు పొందిన వార్తలతో మౌలిక సదుపాయాల కంపెనీ జేకుమార్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇతర వివరాలు చూద్దాం..

ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ లిమిటెడ్
గ్లోబల్‌ బ్రోకింగ్ కంపెనీ సీఎల్‌ఎస్‌ఏ అటు పీఎఫ్‌సీ, ఇటు ఆర్‌ఈసీ కౌంటర్ల రేటింగ్స్‌ను అమ్మవచ్చు(సెల్‌) నుంచి కొనవచ్చు(బయ్‌)కు తాజాగా సవరించింది. అంతేకాకుండా పీఎఫ్‌సీ షేరుకి టార్గెట్‌ ధరను రూ. 120 నుంచి రూ. 150కు పెంచింది. ఈ బాటలో ఆర్‌ఈసీ షేరు టార్గెట్‌ ధరను సైతం రూ. 160 నుంచి రూ. 180కు పెంచింది. ప్రయివేట్‌ రంగ మొండిబకాయిల(ఎన్‌పీఎల్‌) గుర్తింపును రెండు కంపెనీలూ దాదాపు పూర్తిచేసినట్లేనని సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. దీంతో 2021 ఆర్థిక సంవత్సరం నుంచీ కంపెనీల ఆర్జన మెరుగుపడనున్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పీఎఫ్‌సీ షేరు 4.5 శాతం ఎగసి రూ. 109 వద్ద ట్రేడవుతుంటే.. ఆర్‌ఈసీ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 150 సమీపానికి చేరింది. 

జేకుమార్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌
మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పట్టణ, పారిశ్రామికాభివృద్ధి సంస్థ(సిడ్కో) నుంచి రూ. 682 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించినట్లు జేకుమార్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ పేర్కొంది. ఆర్డర్‌లో భాగంగా కోస్టల్‌ రహదారిని డిజైన్‌ చేసి నిర్మించాల్సి ఉంటుందని తెలియజేసింది. అమర్‌మార్గ్‌ ఎంటీహెచ్‌ఎల్‌ జంక్షన్‌ నుంచి నవీముంబై ఎయిర్‌పోర్ట్‌ లింక్‌వరకూ రహదారిని అభివృద్ధి చేయవలసి ఉంటుందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జేకుమార్‌ ఇన్‌ఫ్రా షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.5 శాతం లాభపడి రూ. 122 వద్ద ట్రేడవుతోంది.