ఇండియాబుల్స్‌ గ్రూప్‌ షేర్ల పతనం

ఇండియాబుల్స్‌ గ్రూప్‌ షేర్ల పతనం

మళ్లీ కంపెనీపై ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పీఐఎల్‌) దాఖలైనట్లు వెలువడిన వార్తలు ఇండియాబుల్స్‌ గ్రూప్‌ కౌంటర్లలో అమ్మకాలకు దారిచూపుతున్నాయి. ఇన్వెస్టర్లు గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలలో అమ్మకాలకు ఎగబడటంతో అన్ని కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. అయితే హైకోర్టులో ఇంతవరకూ పిల్‌ దాఖలుకాలేదంటూ కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. షేర్ల తీరు చూద్దాం..

పతన బాటలో
ఇండియాబుల్స్‌ గ్రూప్‌ కౌంటర్లన్నిటికీ అమ్మకాల సెగ తగులుతోంది. దీంతో నష్టాలతో నేలచూపులకు పరిమితవుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 5.4 శాతం పతనమై రూ. 424 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 405 వరకూ జారింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. ఐబీ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ షేరు సైతం 4.5 శాతం నీరసించింది. రూ. 81.4 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ షేరు 3.4 శాతం క్షీణించి రూ. 64 దిగువకు చేరింది. ఈ బాటలో ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ 6.5 శాతం తిరోగమించి రూ. 155 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో రూ. 146 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది.

ఇతర వివరాలు
గతంలో విజిల్‌ బ్లోయర్‌గా కోర్టులో పిటిషన్‌ వేసి వెనక్కి తీసుకున్న అభయ్‌ యాదవ్‌ ప్రస్తావించిన అంశాలనే సోషల్‌ మీడియా ద్వారా కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారానికి వినియోగించుకుంటున్నట్లు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. హైకోర్టులో ఎలాంటి పిల్‌ దాఖలుకాకపోగా..  కంపెనీని దెబ్బతీసే ఎత్తుగడల్లో భాగంగా సోషల్‌ మీడియా ద్వారా వ్యతిరేక అంశాలను లీక్ చేస్తున్నట్లు పేర్కొంది. వీటిలో వాస్తవాలు లేకపోగా.. కంపెనీ, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు మధ్య విలీనం నేపథ్యంలో అసత్య ప్రచారం జరుగుతున్నట్లు వివరించింది.