ఈ మిడ్‌ క్యాప్స్‌ జోరు చూడతరమా

ఈ మిడ్‌ క్యాప్స్‌ జోరు చూడతరమా

ఆటుపోట్ల మధ్య కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్లు కొన్ని ఎంపిక చేసిన చిన్న, మధ్యతరహా కౌంటర్లవైపు దృష్టిసారించారు. వీటిలో కొనుగోళ్లకు ఎగబడటంతో ఒడిదొడుకుల ట్రెండ్‌లోనూ ఈ కౌంటర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినప్పటికీ జీడీపీ మందగమనం, బ్యాంకుల విలీనం, రూపాయి పతనం వంటి అంశాలు దేశీయంగా ఆందోళనలకు కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మార్కెట్ల హెచ్చుతగ్గుల్లోనూ కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌, అరవింద్‌ లిమిటెడ్‌, మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌: హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రొడక్టుల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 16.5 శాతం దూసుకెళ్లింది. రూ. 301కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 305 వరకూ పుంజుకుంది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 9,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 34,000 షేర్లు ట్రేడయ్యాయి.

అరవింద్‌ లిమిటెడ్‌: బ్రాండెడ్‌ టెక్స్‌టైల్స్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7.5 శాతం జంప్‌చేసింది. రూ. 50కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 8.58 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.53 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌: ఇంధన రంగ ఈ పీఎస్‌యూ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5.3 శాతం ఎగసింది. రూ. 48కు చేరింది. ఇంట్రాడేలో రూ. 50 వరకూ పెరిగింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 62,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 48,000 షేర్లు ట్రేడయ్యాయి.

దిలీప్‌ బిల్డ్‌కాన్‌ లిమిటెడ్‌: మౌలిక సదుపాయాల రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6.6 శాతం పురోగమించింది. రూ. 375కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 385 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 72,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 37,300 షేర్లు ట్రేడయ్యాయి.