ఈ చిన్న షేర్లకు.. దూకుడెక్కువ

ఈ చిన్న షేర్లకు.. దూకుడెక్కువ

ఆటుపోట్ల మధ్య కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్లు కొన్ని ఎంపిక చేసిన చిన్న, మధ్యతరహా కౌంటర్లవైపు దృష్టిసారించారు. వీటిలో కొనుగోళ్లకు ఎగబడటంతో ఒడిదొడుకుల ట్రెండ్‌లోనూ ఈ కౌంటర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మార్కెట్ల హెచ్చుతగ్గుల్లోనూ కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో డాక్టర్‌ లాల్‌ పాథ్‌ లేబ్స్‌, గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌, నవకార్‌ కార్పొరేషన్‌, జిందాల్‌ డ్రిల్లింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, గుజరాత్‌ అపోలో ఇండస్ట్రీస్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

డాక్టర్‌ లాల్‌ పాథ్‌ లేబ్స్‌: డయాగ్నోస్టిక్‌ సంబంధ హెల్త్‌కేర్‌ సర్వీసుల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5 శాతం ఎగసింది. రూ. 1241కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 1255 వరకూ పుంజుకుంది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 3,900 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 4,900 షేర్లు ట్రేడయ్యాయి.

నవకార్‌ కార్పొరేషన్‌: లాజిస్టిక్స్‌, రవాణా రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసింది. రూ. 35కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 56,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 35,000 షేర్లు ట్రేడయ్యాయి.

జిందాల్‌ డ్రిల్లింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌: ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ సర్వీసులందించే ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 11 శాతం పురోగమించింది. రూ. 82కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 89 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 2000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 46000 షేర్లు ట్రేడయ్యాయి. 

గుజరాత్‌ అపోలో ఇండస్ట్రీస్‌: ఇంజినీరింగ్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 19 శాతం దూసుకెళ్లింది. రూ. 144కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 420 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 4200 షేర్లు ట్రేడయ్యాయి. 

గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌: కాస్టిక్‌ సోడా తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసింది. రూ. 425కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 3300 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 7300 షేర్లు ట్రేడయ్యాయి.