బ్యాంకులందు ఐడీబీఐ వేరయా!

బ్యాంకులందు ఐడీబీఐ వేరయా!

గత వారాంతాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ప్రణాళికలు ప్రకటించారు. 10 బ్యాంకులను విలీనం చేయడం ద్వారా 4 బలమైన బ్యాంకుల ఆవిర్భావానికి సన్నాహాలు చేశారు. మరోవైపు 10 బ్యాంకులకు రూ. 55,000 కోట్లకుపైగా తాజా పెట్టుబడులనూ సిద్ధం చేశారు. అయితే క్యూ2లో జీడీపీ ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి నీరసించడం, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడం వంటి ప్రతికూల అంశాలు మార్కెట్లను దెబ్బతీయగా.. ఇన్వెస్టర్లు పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాలకు ఎగబడుతున్నారు. కాగా.. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) మెరుగుపడేందుకు వీలుగా కేంద్ర కేబినెట్‌ తాజాగా రూ. 9,000 కోట్లను అందించనున్నట్లు వెలువడిన వార్తలు ఐడీబీఐ బ్యాంకుకు జోష్‌నిచ్చాయి. దీంతో ఈ కౌంటర్‌ భారీ లాభాలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్‌ షేరు 8.2 శాతం దూసుకెళ్లింది. రూ. 29కు చేరింది. ఇతర పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లు మాత్రం భారీ ట్రేడింగ్‌ పరిమాణంతో కుప్పకూలాయి. వివరాలు చూద్దాం..

ఇండియన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌: ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 12.5 శాతం కుప్పకూలింది. రూ. 175కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 76,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.92 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

కెనరా బ్యాంక్‌: ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 11 శాతం పడిపోయింది. రూ. 196కు చేరింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 4.15 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 9.5 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌: ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 9 శాతం పతనమైంది. రూ. 59కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 14.14 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 38.8 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

యూనియన్‌ బ్యాంక్‌: ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 9 శాతం కుప్పకూలింది. రూ. 54కు చేరింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 7 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 11 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.