రుపీ బోర్లా.. 72.16కు!

రుపీ బోర్లా.. 72.16కు!

ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో తిరిగి డాలరు ఊపందుకోవడంతో వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 99ను అధిగమించగా.. రూపాయి ప్రారంభంలోనే 64 పైసలు పడిపోయింది. సాంకేతికంగా కీలకమైన 72 దిగువకు చేరింది. ప్రస్తుతం మరింత నీరసించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 74 పైసలు(1 శాతంపైగా)  కోల్పోయి 72.16 వద్ద ట్రేడవుతోంది. సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయకపోగా.. శుక్రవారం రూపాయి 38 పైసలు(0.55 శాతం) పుంజుకుంది. రెండు వారాల గరిష్టం 71.42 వద్ద ముగిసింది. ఒక దశలో 71.38 వరకూ బలపడింది. 

ప్చ్‌.. ఆగస్ట్‌లోనూ 
తాజాగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడం, ఈ నెల మధ్యలో చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టవచ్చన్న అంచనాలు.. డాలరు బలాన్నిస్తున్నాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 99.24కు బలపడింది. మరోవైపు దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతుండటం రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వరుసగా రెండో నెల ఆగస్ట్‌లోనూ ఎఫ్‌పీఐల విక్రయాలు కొనసాగాయి. ఈక్విటీలలో భారీగా రూ. 17,592 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. జులైలోనూ ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 14,383 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశాలకుతోడు ముడిచమురు, బంగారం ధరలు పెరుగుతుండటం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నట్లు నిపుణులు వివరించారు. దేశీ చమురు అవసరాల్లో 75 శాతం వరకూ విదేశాలపైనే ఆధారపడుతుండగా.. పసిడిని పూర్తిగా దిగుమతి చేసుకోవలసి ఉండటమే దీనికి కారణమని వివరించారు.