జీడీపీ- బ్యాంకుల విలీనమే దిక్సూచి

జీడీపీ- బ్యాంకుల విలీనమే దిక్సూచి

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు దేశ ఆర్థిక పురోభివృద్ధి గణాంకాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల భారీ విలీన అంశాలు ప్రధానంగా మార్గనిర్దేశనం చేసే అవకాశముంది. వారాంతాన(30న) రెండు కీలక అంశాలకు కేంద్ర ప్రభుత్వం తెర తీసింది. ఓవైపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పీఎస్‌యూ బ్యాంకుల భారీ విలీన ప్రతిపాదనను ప్రకటించారు. మరోవైపు గణాంకాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో దేశ జీడీపీ 5 శాతం వృద్ధికే పరిమితమైంది. 2013 క్యూ4 తదుపరి ఇది అత్యల్ప వృద్ధికాగా.. సర్వీసులు, తయారీ, వ్యవసాయ రంగాలు మందగించడంతో ఆర్థిక వ్యవస్థ నీరసించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో ఈ ప్రభావం వచ్చే వారం ట్రేడింగ్‌పై కనిపించే వీలున్నట్లు  భావిస్తున్నారు. గతేడాది(2018-19) క్యూ4(జనవరి-మార్చి)లో జీడీపీ 6.6 శాతం పురోగమించింది.

బ్యాంకుల విలీనం
ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బలోపేతం చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు ప్రకటించింది. 10 పీఎస్‌యూ బ్యాంకుల మధ్య విలీనం ద్వారా 4 పెద్ద బ్యాంకులు ఏర్పడనున్నాయి. దీంతో ఇప్పటివరకూ విడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 18 పీఎస్‌యూ రంగ బ్యాంకుల సంఖ్య ఇకపై 12కు తగ్గనుంది. తద్వారా పటిష్ట బ్యాలన్స్‌షీట్‌, భారీ రిస్క్‌లను సైతం తట్టుకునే సామర్థ్యం బ్యాంకులకు సమకూరనున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈ ప్రభావం వారాంతాన కనిపించినప్పటికీ వచ్చే వారం సైతం పలు బ్యాంక్‌ కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

నాలుగు రోజులే
వినాయక చవితి పర్వదినం సందర్భంగా సోమవారం(సెప్టెంబర్‌ 2న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో వచ్చే వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. మరోవైపు లేబర్‌ హాలిడే సందర్భంగా సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం పనిచేయవు. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌లకు సెలవు ప్రకటించారు. దీంతో తొలి సెషన్‌లో ట్రేడింగ్‌ యాక్టివిటీ సైతం తక్కువగా నమోదయ్యే వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. 

ఆటో స్టాక్స్‌
ఆగస్ట్‌ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లు వచ్చే వారం యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశముంది. ఇక అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద చర్చలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును ప్రభావితం చేయనుంది. ముడిచమురు, బంగారం ధరలు రూపాయిపై ప్రభావం చూపనున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు సైతం మార్కెట్లలో ట్రెండ్‌కు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.