రుపీ డీలా.. మళ్లీ 72కు

రుపీ డీలా.. మళ్లీ 72కు

వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ వెనకడుగు వేస్తోంది. డాలరుతో మారకంలో బుధవారం 29 పైసలు క్షీణించి 71.77 వద్ద ముగిసిన రూపాయి మరోసారి బలహీనంగా ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో తొలుత 14 పైసలు తక్కువగా 71.90 వద్ద మొదలైంది. తదుపరి మరికొంత నీరసించింది. ప్రస్తుతం 23 పైసలు(0.32) శాతం తిరోగమించింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 72 మార్క్‌ను తాకింది. బుధవారం 71.50 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో 71.87 వరకూ వెనకడుగు వేసింది.

ఈల్డ్స్‌ ఎఫెక్ట్‌?
కొద్ది రోజులుగా యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ పతనమవుతుండటంతో ఆర్థిక మాంద్య ఆందోళనలు బలపడుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. బుధవారం 30 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ సరికొత్త కనిష్టం 1.907 శాతానికి చేరగా.. 10 ఏళ్ల, 2 ఏళ్ల కాలపరిమితిగల బాండ్ల ఈల్డ్స్‌ మధ్య అంతరం తగ్గుతుండం గమనార్హమని ఫారెక్స్‌ వర్గాలు చెబుతున్నాయి! ఇది ఆర్థిక మాంద్య సంకేతాలను ఇస్తున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక డాలరుతో మారకంలో ఆన్‌షోర్‌ యువాన్‌ 11ఏళ్ల తదుపరి 7.17ను తాకింది. 10 ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 1.447 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో బంగారం, డాలరు, జపనీస్‌ యెన్‌ వంటి రక్షణాత్మక పెట్టుబడులకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు నిపుణలు వివరించారు. ఫలితంగా వర్ధమాన దేశాల కరెన్సీలు డీలా పడుతున్నట్లు తెలియజేశారు.

ఆర్‌బీఐ బూస్ట్‌
మిగులు నిల్వల నుంచి డివిడెండ్‌ రూపేణా రిజర్వ్‌ బ్యాంకు రికార్డ్‌ స్థాయిలో రూ. 1.76 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయనున్నట్లు వెలువడిన వార్తలు సైతం మంగళవారం రూపాయికి జోష్‌నిచ్చినట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందన్న అంచనాలు ప్రభావం చూపినట్లు తెలియజేశారు. దీంతో రూపాయి 54 పైసలు ఎగసి 71.48 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా.. ఇంతక్రితం మార్చి 18న మాత్రమే రూపాయి ఈ స్థాయిలో పుంజుకుంది. 

ఎఫ్‌పీఐల వెనకడుగు
ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు తలెత్తుతున్న సంకేతాలతో పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు సహాయక ప్యాకేజీలు అమలు చేసేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలపడగా.. వర్ధమాన కరెన్సీలు బలహీనపడుతున్నాయి. ఇటీవల పసిడి, ముడిచమురు ధరలు పెరుగుతూ రూపాయిపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటికితోడు దేశీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతుండటం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆగస్ట్‌ నెలలో ఇప్పటివరకూ(1-23 మధ్య) ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో ఏకంగా రూ. 12,105 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌లో రూపాయి 4.5 శాతం తిరోగమించింది. కాగా.. ఎఫ్‌పీఐలు ఈ నెలలో రుణ మార్కెట్లో రూ. 9,091 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం!