వారెవ్వా.. పసిడి జిగేల్

వారెవ్వా.. పసిడి జిగేల్

తాజాగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు విదేశీ మార్కెట్లో బంగారం ధరలకు ఊపునివ్వగా.. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి పతనం మరింత సహకరించింది. దీంతో దేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్‌లో పసిడి సరికొత్త రికార్డును సాధించింది. 10 గ్రాముల ధర రూ. 39,340కు ఎగసింది. తద్వారా బంగారం ధర చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. 2019లో ఇప్పటివరకూ బంగారం ధర 25 శాతం జంప్‌చేయడం విశేషం! ఈ బాటలో వెండి సైతం కేజీ ధర రూ. 45,000 మార్క్‌ను అధిగమించింది. 2016 అక్టోబర్‌లో మాత్రమే వెండి ఈస్థాయికి చేరడం గమనార్హం! ఇందుకు ఆరేళ్ల తరువాత మళ్లీ న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ 2013 ఏప్రిల్‌ తరువాత మళ్లీ 1544 డాలర్లను దాటడం కారణమైంది. స్పాట్‌ మార్కెట్లోనూ  ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 2 శాతం ఎగసి 1530 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో రూపాయి విలువ 72కు పడిపోయింది. ఇతర వివరాలు చూద్దాం..

ఎందుకంటే..
ఏడాది కాలంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య వివాదాలు వారాంతాన మరింత ముదిరాయి. ఇది కరెన్సీ వార్‌కు సైతం దారితీసింది. మొత్తం 550 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై దశలవారీగా 5-10 శాతం అదనపు టారిఫ్‌ల విధింపునకు అమెరికా ప్రెసిడెంట్‌ ప్రతిపాదించారు. ఇందుకు ప్రతిస్పందిస్తూ తొలిగా 75 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ ప్రొడక్టులపై చైనా ప్రభుత్వం సైతం అదనపు సుంకాల బాదుడుకు సిద్ధపడుతోంది. మరోవైపు తమ కరెన్సీ యువాన్‌ మారకపు విలువను చైనా కనిష్ట స్థాయిలో 7.05గా నిర్ణయించింది. 

రిజర్వ్‌ బ్యాంకులూ..
అమెరికా, చైనా మధ్య నెలకొన్న తాజా పరిస్థితులతో ఆర్థిక మాంద్య  ఆందోళనలకు లోనైన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలూ, కేంద్ర బ్యాంకులూ బంగారంలో కొనుగోళ్లకు ఎగబడ్డాయి. రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి సంక్షోభ సమయాలలో డిమాండ్ పెరిగే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది రెండో క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రపంచ కేంద్ర బ్యాంకులు సంయుక్తంగా 224 టన్నులకుపైగా పసిడిని కొనుగోలు చేసినట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఈ నెల మొదట్లో వెల్లడించింది. దీంతో ఈ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి-జూన్‌)లో 374 టన్నుల పసిడిని సెంట్రల్‌ బ్యాంకులు సొంతం చేసుకున్నట్లయ్యిందని పేర్కొంది. ఇది 2000 తదుపరి అత్యధికమని తెలియజేసింది. ఇక దేశీయంగా జులైకల్లా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల విలువ రూ. 5,080 కోట్లుగా నమోదైంది.

దేశీయంగా..
విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మెరుస్తుండటంతో దేశీయంగానూ ఈ ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 72 స్థాయికి చేరడంతో ధరలకు రెక్కలొస్తున్నట్లు బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల పసిడి రూ. 145 లాభపడి రూ. 38,910 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ రూ. 339 ఎగసి రూ. 44,941 వద్ద ట్రేడవుతోంది.