రూపాయి.. నేలచూపు షురూ

రూపాయి.. నేలచూపు షురూ

దేశీ కరెన్సీ వరుస నష్టాలకు వారాంతాన అడ్డుకట్టపడినప్పటికీ ఒక్కరోజులోనే తిరిగి పతన బాట పట్టింది. డాలరుతో మారకంలో ట్రేడింగ్ ప్రారంభంలోనే 32 పైసలు క్షీణించింది. శుక్రవారం ముగింపు 71.66తో పోలిస్తే ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 71.98 వద్ద రూపాయి ప్రారంభమైంది. తదుపరి మరింత బలహీనపడింది. ప్రస్తుతం 44 పైసలు పడిపోయి 72.10 వద్ద ట్రేడవుతోంది.   

వారాంతన బౌన్స్‌బ్యాక్‌
ఆర్థిక వ్యవస్థ పురోగతికి దన్నుగా వారాంతాన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దీంతో మిడ్‌సెషన్‌ నుంచీ అటు స్టాక్‌ మార్కెట్లు.. ఇటు దేశీ కరెన్సీ నష్టాల నుంచి కోలుకున్నాయి. లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్ల పతనం నుంచి బయటపడటంతోపాటు 250 పాయింట్ల బౌన్స్‌బ్యాక్‌ సాధించగా.. రూపాయి సైతం 8 నెలల కనిష్టం 72 స్థాయి నుంచి పుంజుకుంది. శుక్రవారం డాలరుతో మారకంలో చివరికి 15 పైసలు బలపడి 71.66 వద్ద ముగిసింది. తొలుత ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 19 పైసలు నీరసించి 72 వద్ద ప్రారంభమైంది. తదుపరి 72.05 వద్ద  ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఇది 8 నెలల కనిష్టంకాగా.. ఇంతక్రితం 2018 డిసెంబర్‌ 14న మాత్రమే రుపీ 72 సమీపానికి జారింది. ట్రేడింగ్‌ చివర్లో రూపాయి 71.56 వరకూ ఎగసింది కూడా. 

ఎఫ్‌పీఐల వెనకడుగు
ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు తలెత్తుతున్న సంకేతాలతో పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు సహాయక ప్యాకేజీలు అమలు చేసేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 98.3కు బలపడగా.. జపనీస్‌ యెన్‌ వంటి రక్షణాత్మక కరెన్సీలు సైతం బలహీనపడుతున్నాయి. ఇటీవల పసిడి, ముడిచమురు ధరలు పెరుగుతూ రూపాయిపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటికితోడు దేశీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతుండటం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆగస్ట్‌ నెలలో ఇప్పటివరకూ(1-23 మధ్య) ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో ఏకంగా రూ. 12,105 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌లో రూపాయి 4.5 శాతం తిరోగమించింది. కాగా.. ఎఫ్‌పీఐలు ఈ నెలలో రుణ మార్కెట్లో రూ. 9,091 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం!