మార్కెట్లకు ఈ వారం కీలక‌ం సుమా..!

మార్కెట్లకు ఈ వారం కీలక‌ం సుమా..!

ఈ వారం(26-30) దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌కు పలు అంశాలు కీలకంగా నిలవనున్నాయి. వారాంతాన(23న) కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన సూపర్‌ రిచ్‌పై పన్ను ప్రతిపాదనను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దన్నుగా పలు చర్చలు ప్రకటించారు. వాహన రంగం, మౌలిక సదుపాయాలు, ఎస్‌ఎంఈలు తదితర పలు రంగాలకు ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. వడ్డీ రేట్లను రెపోకు అనుసంధానించడం ద్వారా రుణాలకు డిమాండ్‌ను తద్వారా వినియోగానికి జోష్‌నిచ్చే ప్రయత్నాలు చేపట్టినట్లు విశ్లేషకులు వివరించారు. దీంతో శుక్రవారం(23న) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటను వీడి బౌన్స్‌బ్యాక్‌ సాధించిన సంగతి తెలిసిందే. 

Related image

వాణిజ్య వివాదాలు
ఏడాది కాలంగా నలుగుతున్న అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు వారాంతన మళ్లీ భగ్గుమన్నాయి. తాజాగా చైనాలో కార్యకలాపాలు కలిగిన అమెరికన్‌ కంపెనీలు ప్రత్యామ్నాయ ప్రాంతాలకు తరలిపోవాలంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. స్వదేశానికి తిరిగి రావడం ద్వారా ప్రొడక్టులను స్థానికంగా తయారు చేయాలంటూ కోరారు. అంతకుముందు చైనా ప్రభుత్వం 75 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ దిగుమతులపై 5-10 శాతం టారిఫ్‌లను విధించనున్నట్లు ప్రకటించడంతో ట్రంప్‌ తాజా ట్వీట్‌కు తెరతీశారు. అయితే వాణిజ్య వివాద పరిష్కారానికి ఒప్పందం కుదుర్చుకోకుంటే 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై డిసెంబర్‌ నుంచీ సుంకాలు విధించనున్నట్లు ఇటీవల ట్రంప్‌ చేసిన హెచ్చరికలకు ప్రతిగానే చైనా స్పందించినట్లు తెలుస్తోంది. ఫలితంగా అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం ప్రపంచ స్టాక్‌ మార్కెట్లపై వచ్చేవారం కనిపించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

ఫెడ్‌ ఎఫెక్ట్‌
వారాంతాన కేంద్ర బ్యాంకుల సదస్సులో ప్రసంగించిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ ఆర్థిక పురోభివృద్ధికి దన్నుగా తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. జోరందుకున్న ఉద్యోగ గణాంకాలు, లక్ష్యానికి అనుగుణమైన ద్రవ్యోల్బణం నేపథ్యంలో జీడీపీ ప్రస్తుత వృద్ధిని నిలిపేందుకు అవసరమైన విధానాలను అవలంబించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆశించిన స్థాయిలో ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

ఎఫ్‌అండ్‌వో 
ఆగస్ట్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు గురువారం(29)తో ముగియనుంది. దీంతో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపుతారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక వచ్చే శుక్రవారం(30న)  ఏప్రిల్‌-జూన్‌ కాలానికి దేశ ఆర్థిక పురోగతి గణాంకాలు వెలువడనున్నాయి. జనవరి-మార్చిలో జీడీపీ 5.8 శాతం పుంజుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇదే రోజు జులై నెలకు 8 కీలక మౌలిక రంగ గణాంకాలు విడుదల కానున్నాయి. జూన్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 0.2 శాతమే వృద్ధి చూపింది. గురువారం క్యూ2లో అమెరికా జీడీపీ వృద్ధి రెండోదశ అంచనాలు వెలువడనున్నాయి. 

ఇతర అంశాలూ
పసడి, ముడిచమురు ధరలతోపాటు.. డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు.. తదితర పలు అంశాలు సైతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు తెలియజేశారు.