ట్రంప్‌ షాక్‌- మార్కెట్ల భారీ పతనం

ట్రంప్‌ షాక్‌- మార్కెట్ల భారీ పతనం

చైనాలో తయారీ కార్యకలాపాలు ఏర్పాటు చేసుకున్న కంపెనీలు వెంటనే అక్కడినుంచి వైదొలగాలంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేయడంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. చైనా నుంచి కార్యకలాపాలను ప్రత్యామ్నాయ ప్రదేశాలకు తరలించాలంటూ పరిశ్రమవర్గాలకు ట్రంప్‌ సూచించారు. దీంతో ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌సహా పలు బ్లూచిప్‌ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి వారాంతాన డోజోన్స్ 623 పాయింట్లు(2.4 శాతం) పడిపోయి 25,629కు చేరగా.. ఎస్‌అండ్‌పీ సైతం 76 పాయింట్లు(2.6 శాతం) పతనమై 2,847 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 239 పాయింట్లు(3 శాతం) కుప్పకూలింది. 7,751 వద్ద స్థిరపడింది. వెరసి వారం మొదట్లో ఆర్జించిన లాభాలను మార్కెట్లు పోగొట్టుకున్నాయి. అంతేకాకుండా వరుసగా నాలుగో వారం నష్టాలతో నిలిచాయి. గత వారం నికరంగా డోజోన్స్ 1 శాతం, ఎస్‌అండ్‌పీ 1.4 శాతం, నాస్‌డాక్‌ 1.8 శాతం చొప్పున తిరోగమించాయి. ఈ నెలలో ఇప్పటివరకూ ఒకే రోజులో నాస్‌డాక్‌ ఆరుసార్లు, డోజోన్స్‌ ఐదుసార్లు, ఎస్‌అండ్‌పీ నాలుగుసార్లు 1 శాతంపైగా పతనంకావడం గమనార్హం!

తరలి రండి
మన బ్లూచిప్‌ కంపెనీలు వెనువెంటనే చైనాను వీడి వెళ్లాలంటూ ట్రంప్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. చైనాకు ప్రత్యామ్నాయాలను వెదుక్కోవాలని, అంతేకాకుండా అమెరికాకు తిరిగి వచ్చి స్వదేశంలోనే ప్రొడక్టులను తయారు చేయాలని కోరారు. అయితే ఇందుకు ట్రంప్‌ ఎలాంటి అధికారిక చర్యలు తీసుకునేదీ వెల్లడికాలేదు. అమెరికన్‌ వాహనాలు, విడిభాగాలుసహా 75 బిలియన్‌ డాలర్ల విలువైన వివిధ ప్రొడక్టులపై సెప్టెంబర్‌, డిసెంబర్‌లలో 5-10 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. దీంతో ట్రంప్‌ తాజాగా చైనాపై కన్నెర్ర చేశారు. అయితే వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోకుంటే డిసెంబర్‌ నుంచీ 300 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై అదనపు టారిఫ్‌లను విధిస్తామన్న ట్రంప్‌ హెచ్చరికలకు ప్రతిగానే చైనా స్పందించినట్లు విశ్లేషకులు వివరించారు.

Image result for Apple and intel

దిగ్గజాలు బోర్లా
ట్రంప్‌ వ్యాఖ్యలతో చైనాలో తయారీ, విక్రయాలు నిర్వహిస్తున్న ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ షేరు 4.6 శాతం పతనమైంది. ఈ బాటలో చిప్‌ తయారీ కంపెనీలు ఎన్‌విడియా, బ్రాడ్‌కామ్‌ 5 శాతం చొప్పున దెబ్బతినగా.. ఇంటెల్‌ కార్ప్‌ 4 శాతం నీరసించింది. రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో స్పెషాలిటీ రిటైలర్‌ ఫుట్‌ లాకర్‌ ఇంక్‌ 19 శాతం కుప్పకూలింది. నిరుత్సాహకర పనితీరు, సీఈవో రాజీనామా వార్తలతో కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ దిగ్గజం హెచ్‌పీ ఇంక్‌ 6 శాతం దిగజారింది. అయితే తొలుత పతనమైన కేటర్‌పిల్లర్‌ ఇంక్‌ షేరు తదుపరి బౌన్స్‌ అయ్యింది. 3.3 శాతం ఎగసింది.

Image result for Fed powell

తగిన చర్యలు: పావెల్‌
జాక్సన్‌ హోల్‌ వద్ద గురువారం ప్రారంభమైన కేంద్ర బ్యాంకుల వార్షిక సదస్సులో శుక్రవారం ఫెడరల్ రిజర్వ్‌ చైర్మన్‌ పావెల్‌ ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వృద్ధి రేటులో కొనసాగేందుకు అవసరమైన చర్యలను తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. పటిష్ట జాబ్‌ మార్కెట్‌, 2 శాతం ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఆర్థిక పురోభివృద్ధికి దన్నుగా ఎలాంటి పాలసీ విధానాలు అవలంబించాలన్నదే తమ ముందున్న సవాల్‌ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తలెత్తిన వాణిజ్య వివాదాలపై ఎలాంటి రూల్‌బుక్‌ లేదని.. వీటికి అనుగుణంగా విధానాలు రూపొందించడం సవాళ్లతో కూడుకున్నదని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాకు రాలేమంటూ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

యూరప్‌ డీలా..
శుక్రవారం యూరోపియన్‌ మార్కెట్లు నేలచూపులతో ముగిశాయి. యూకే 0.5 శాతం డీలాపడగా.. జర్మనీ, ఫ్రాన్స్‌ 1.2 శాతం చొప్పున క్షీణించాయి. ఇక ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రెండ్‌ నెలకొంది. థాయ్‌లాండ్‌, చైనా, హాంకాంగ్‌, జపాన్, ఇండొనేసియా 0.8-0.3 శాతం మధ్య పుంజుకోగా.. సింగపూర్‌ 0.6 శాతం వెనకడుగు వేసింది. మిగిలిన మార్కెట్లలో కొరియా 0.15 శాతం నష్టపోగా, తైవాన్‌ నామమాత్ర లాభంతో ముగిసింది.