రుపీ @72- 2019 కనిష్టం

రుపీ @72- 2019 కనిష్టం

కొద్ది రోజులుగా వెనకడుగులో కదులుతున్న దేశీ కరెన్సీ మరోసారి డీలాపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 19 పైసలు(0.25 శాతం) క్షీణించింది.  డాలరుతో మారకంలో 72 వద్ద ప్రారంభమైంది. వెరసి సాంకేతికంగా కీలకమైన 72 మార్క్‌కు బలహీనపడింది. అంతేకాకుండా ఈ ఏడాది(2019)లో.. కనిష్ట స్థాయికి చేరింది. ఇంతక్రితం 2018 డిసెంబర్‌ 14న మాత్రమే రూపాయి 71.90ను తాకింది.  ఈ నెల(ఆగస్ట్‌)లో ఇంతవరకూ రూపాయి 4.6 శాతం పతనంకావడం గమనార్హం! ఒకే నెలలో ఈ స్థాయి పతనం గత ఆరేళ్లలో నమోదుకాలేదని ఫారెక్స్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా.. గురువారం సైతం రూపాయి ఇంట్రాడేలో 71.97 వరకూ తిరోగమించింది. చివరికి 26 పైసలు నీరసించి 8 నెలల కనిష్టం 71.81 వద్ద ముగిసింది. డాలరుతో మారకంలో చైనీస్‌ కరెన్సీ యువాన్‌ మరోసారి రెండేళ్ల కనిష్టానికి చేరడంతో వర్ధమాన దేశాల కరెన్సీలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

పతనానికి చెక్‌
రెండు రోజుల పతనానికి అడ్డుకట్ట వేస్తూ బుధవారం డాలరుతో మారకంలో రూపాయి 16 పైసల రికవరీ సాధించింది. 71.55 వద్ద ముగిసింది. ఒక దశలో 71.36 వద్ద  ఇంట్రాడే గరిష్టాన్ని సైతం తాకింది. అయితే అంతకుముందు రెండు రోజులూ అంటే సోమ, మంగళవారాల్లో రూపాయి మారకపు విలువ వరుసగా డీలాపడుతూ వచ్చింది. మంగళవారం ఒడిదొడుకుల మధ్య కదిలిన రూపాయి విలువ చివరికి 28 పైసలు క్షీణించి 71.71 వద్ద స్థిరపడింది. ఇది ఆరు నెలల కనిష్టంకాగా.. సోమవారం(19న) సైతం రూపాయి 29 పైసలు బలహీనపడి 71.43 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 

కారణాలెన్నో..
ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు తలెత్తుతున్న సంకేతాలతో పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు సహాయక ప్యాకేజీలు అమలు చేసేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 98.3కు బలపడగా.. జపనీస్‌ యెన్‌ వంటి రక్షణాత్మక కరెన్సీలు సైతం బలహీనపడ్డాయి. వీటికితోడు దేశీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతుండటం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. అంతేకాకుండా ఇటీవల పసిడి, ముడిచమురు ధరలు పెరుగుతూ రూపాయిపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.