రియల్టీ, మెటల్స్‌, బ్యాంక్స్‌- బేర్‌

రియల్టీ, మెటల్స్‌, బ్యాంక్స్‌- బేర్‌

ప్రోత్సాహకర విదేశీ సంకేతాలను పెడచెవిన పెడుతూ నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో తదుపరి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 600 పాయింట్లమేర పతనంకాగా.. నిఫ్టీ దాదాపు 200 పాయింట్లు కోల్పోయింది. వెరసి సెన్సెక్స్‌ సాంకేతికంగా కీలకమైన 37,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరగా.. నిఫ్టీ 10,800 మద్దతు స్థాయిని నిలుపుకోలేకపోయింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. చివరికి సెన్సెక్స్‌ 587 పాయింట్లు దిగజారి 36,473 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ సైతం 177 పాయింట్లు పతనమై 10,741 వద్ద ముగిసింది.

ప్రధానంగా రిటైల్‌ రంగ దిగ్గజాలు వాల్‌మార్ట్‌, టార్గెట్‌, లోవ్స్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో బుధవారం అమెరికా మార్కెట్లు జోరందుకున్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అంశంపై చర్చించినట్లు మినిట్స్‌ వెల్లడించడం కూడా ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. దేశీ మార్కెట్లలో సెంటిమెంటు బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఐటీ మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ 6.7 శాతం పతనంకాగా, మెటల్‌ 3.7 శాతం, పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 3.6-2.4 శాతం, ఆటో 1.7 శాతం చొప్పున నీరసించాయి. అయితే ఐటీ స్వల్పంగా 0.25 శాతం బలపడింది. ప్రయివేట్‌ బ్యాంక్‌ కౌంటర్లలో యస్‌ బ్యాంక్‌ 12 శాతం కుప్పకూలగా.. డీసీబీ, ఆర్‌బీఎల్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌, ఫెడరల్‌, కొటక్‌ మహీంద్రా 8.6-1.7 శాతం మధ్య తిరోగమించాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో కెనరా, జేఅండ్‌కే, బీవోఐ, ఇండియన్‌, ఓబీసీ, బీవోబీ, అలహాబాద్‌, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, యూనియన్‌ 5-3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. మెటల్‌ కౌంటర్లలో ఎన్‌ఎండీసీ, వేదాంతా, హింద్‌ కాపర్‌, కోల్‌ ఇండియా, సెయిల్‌, జిందాల్‌ స్టెయిన్‌, నాల్కో, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌ 10-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఇతర బ్లూచిప్స్‌లో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, జీ, టాటా మోటార్స్ 5-4 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.7-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి.

డీఎల్‌ఎఫ్‌ కుదేల్‌
రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌ 17 శాతం దిగజారగా.. ఇండియాబుల్స్‌, సన్‌టెక్‌, ఒబెరాయ్‌, శోభా, బ్రిగేడ్‌, మహీంద్రా లైఫ్‌, ప్రెస్టేజ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 6-1.5 శాతం మధ్య నీరసించాయి. డెరివేటివ్‌ కౌంటర్లలో అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ కేపిటల్‌ 19 శాతం పడిపోగా.. దివాన్‌ హౌసింగ్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, అశోక్‌ లేలాండ్‌. ఎన్‌సీసీ 10-6.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఇక మరోవైపు టాటా పవర్‌ 4.5 శాతం జంప్‌చేయగా.. దివీస్‌, ఒరాకిల్‌, బీఈఎల్‌,  ఉజ్జీవన్, హావెల్స్‌ 2.3-1.3 శాతం మధ్య ఎగశాయి.

నష్టపోయినవే ఎక్కువ
మార్కెట్లు పతనంతో ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.3-2.2 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1945 నష్టపోగా.. 528 మాత్రమే లాభాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 771 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 354 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం మాత్రం ఇటు ఎఫ్‌పీఐలు రూ. 373 కోట్లు, అటు డీఐఐలు రూ. 296 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. 



Most Popular