యస్‌ బ్యాంక్‌- ఎన్‌ఎండీసీ.. వీక్

యస్‌ బ్యాంక్‌- ఎన్‌ఎండీసీ.. వీక్

సీజీ పవర్‌ కంపెనీలో వాటాను పొందిన ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సైతం వరుసగా ఐదో రోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్యాంక్ రుణాల నాణ్యతపై తాజాగా ఆందోళనలు తలెత్తడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో అమ్మకాలకు దిగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. మరోపక్క ఐరన్‌ ఓర్ లంప్‌, ఫైన్స్‌ ధరలలో కోత పెట్టినట్లు వెల్లడించడంతో పీఎస్‌యూ కంపెనీ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ కౌంటర్లోనూ అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ(ఎంసీఏ) ఖాతాల దర్యాప్తునకు ఆదేశించిన సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ కంపెనీలో యస్‌ బ్యాంక్‌ కొద్ది రోజుల క్రితమే(జూన్‌లో) 12.79 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇది యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌పైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాగా.. మరోపక్క గత వారం అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) ద్వారా రూ. 1930 కోట్లు సమీకరించాక ఈ కౌంటర్‌ అమ్మకాలతో నీరసిస్తూ వస్తోంది. గత వారం క్విప్‌లో భాగంగా యస్‌ బ్యాంకు రూ. 83.55 ధరలో 23.1 కోట్ల షేర్లను అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్‌) కేటాయించింది. తదుపరి గత నాలుగు రోజులుగా యస్‌ బ్యాంక్‌ షేరు 23 శాతంపైగా క్షీణించింది. ఈ బాటలో మరోసారి నేలచూపులతో కదులుతోంది. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 8 శాతం పతనమైంది. రూ. 60 సమీపానికి చేరింది. ఇది 5 ఏళ్ల కనిష్టంకాగా.. ఇంతక్రితం 2014 మార్చి6న మాత్రమే యస్‌ బ్యాంక్‌ షేరు ఈ స్థాయికి చేరింది. ప్రస్తుతం రూ. 4.4  నష్టంతో రూ. 61 వద్ద ట్రేడవుతోంది. 

Image result for NMDC Ltd

ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌
ముడిఇనుము(ఐరన్‌ ఓర్‌) లంప్, ఫైన్స్‌ ఉత్పత్తులపై విక్రయ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఐరన్‌ ఓర్‌ లంప్‌, ఫైన్స్‌లపై సగటున టన్నుకి రూ. 200 చొప్పున ధరలలో కోత పెట్టినట్లు పేర్కొంది. దీంతో లంప్‌ ఓర్‌ టన్ను ధర రూ. 2,900కు చేరగా.. ఐరన్‌ ఓర్‌ ఫైన్స్‌ టన్ను ధర రూ. 2.660ను తాకినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ కౌంటర్ బలహీనపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం పతనమైంది. రూ. 83 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 82.50 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. 



Most Popular