మళ్లీ రూపాయి నేలచూపు

మళ్లీ రూపాయి నేలచూపు

రెండు రోజుల పతనానికి అడ్డుకట్ట వేస్తూ బుధవారం బలపడిన దేశీ కరెన్సీ తిరిగి తిరోగమన పథం పట్టింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 16 పైసలు తక్కువగా 71.71 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం కాస్త కోలుకుని నష్టాలను తగ్గించుకుంది. 12 పైసల క్షీణతతో 71.67 వద్ద ట్రేడవుతోంది. కాగా.. బుధవారం డాలరుతో మారకంలో రూపాయి 16 పైసల రికవరీ సాధించింది. 71.55 వద్ద ముగిసింది. ఒక దశలో 71.36 వద్ద  ఇంట్రాడే గరిష్టాన్ని సైతం తాకింది. అయితే అంతకుముందు రెండు రోజులూ అంటే సోమ, మంగళవారాల్లో రూపాయి మారకపు విలువ వరుసగా డీలాపడుతూ వచ్చింది.  

57 పైసలు డౌన్‌
ఈ వారం మొదట్లో డాలరుతో మారకంలో రూపాయి 57 పైసలు కోల్పోయింది. మంగళవారం ఒడిదొడుకుల మధ్య కదిలిన రూపాయి విలువ చివరికి 28 పైసలు క్షీణించి 71.71 వద్ద స్థిరపడింది. ఇది ఆరు నెలల కనిష్టంకాగా.. సోమవారం(19న) సైతం రూపాయి 29 పైసలు బలహీనపడి 71.43 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు తలెత్తుతున్న సంకేతాలతో పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు సహాయక ప్యాకేజీలు అమలు చేసేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 98.3కు బలపడగా.. జపనీస్‌ యెన్‌ వంటి రక్షణాత్మక కరెన్సీలు సైతం బలహీనపడ్డాయి. వీటికితోడు దేశీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతుండటం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. అంతేకాకుండా ఇటీవల పసిడి, ముడిచమురు ధరలు పెరుగుతూ రూపాయిపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.



Most Popular