సీజీ పవర్‌- యస్‌ బ్యాంక్‌.. ప్చ్‌!

సీజీ పవర్‌- యస్‌ బ్యాంక్‌.. ప్చ్‌!

కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు ఆర్థికంగా పలు అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు వెల్లడించడంతో సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. కాగా.. మరోపక్క సీజీ పవర్‌ కంపెనీలో వాటాను పొందిన ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సైతం వరుసగా నాలుగో రోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్యాంక్ రుణాల నాణ్యతపై తాజాగా ఆందోళనలు తలెత్తడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో అమ్మకాలకు దిగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌
కంపెనీ ఆర్థిక ఖాతాలపై అంతర్గతంగా నిర్వహించిన దర్యాప్తులో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు అనధికారిక ఫైనాన్షియల్‌ లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తున్నదని పేర్కొంది. ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తును చేపట్టేందుకు స్వతంత్ర న్యాయ సంస్థను ఎంపిక చేసినట్లు వివరించింది. కంపెనీకున్న మొత్తం రుణాల విషయంలో గతేడాది రూ. 1053 కోట్లకుపైగా తక్కువచేసి చూపించినట్లు అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవహారాలలో పలు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆపరేషన్‌ కమిటీ ద్వారా గుర్తించినట్లు కంపెనీ తెలియజేయడంతో ఇన్వెస్టర్లు మరోసారి మూకుమ్మడిగా సీజీ పవర్‌ కౌంటర్లో అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం సీజీ పవర్‌ షేరు 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 12 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది చరిత్రాత్మక కనిష్టంకావడం గమనార్హం! గత కొద్ది రోజులుగా ఈ షేరు నేలచూపులకే పరిమితమవుతున్న విషయం విదితమే.

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
 సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ కంపెనీలో యస్‌ బ్యాంక్‌ కొద్ది రోజుల క్రితమే 12.79 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇది యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌పైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాగా.. మరోపక్క గత వారం అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) ద్వారా రూ. 1930 కోట్లు సమీకరించాక ఈ కౌంటర్‌ అమ్మకాలతో డీలాపడిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తొలుత ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు 5 శాతంపైగా పతనమైంది. రూ. 67దిగువకు చేరింది. ఇది 5 ఏళ్ల కనిష్టంకాగా.. ఇంతక్రితం 2014 మార్చి6న మాత్రమే ఈ స్థాయిలో ట్రేడయ్యింది. ప్రస్తుతం 3.4 శాతం నష్టంతో రూ. 69 వద్ద ట్రేడవుతోంది. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలోనూ ఈ షేరు 17 శాతం పతనమైంది!

75 శాతం డౌన్‌
గత వారం క్విప్‌లో భాగంగా యస్‌ బ్యాంకు రూ. 83.55 ధరలో 23.1 కోట్ల షేర్లను అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్‌) కేటాయించింది. ఈ ధరతో పోలిస్తే ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ షేరు 18 శాతం డిస్కౌంట్లో ట్రేడవుతుండటం గమనార్హం! ఈ ఏడాది అంటే ఏప్రిల్‌ నుంచి చూస్తే యస్‌ బ్యాంక్ షేరు 75 శాతం దిగజారింది. మార్చి 29న ఈ షేరు రూ. 275 స్థాయిలో ట్రేడకాగా.. ప్రస్తుతం రూ. 70 దిగువకు చేరడం గమనార్హం!
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');