నేలచూపులతో.. ఐటీ, ఆటో అప్‌

నేలచూపులతో.. ఐటీ, ఆటో అప్‌

మూడు రోజుల ప్రపంచ మార్కెట్ల ర్యాలీకి బ్రేక్‌ పడటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారు. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 39 పాయింట్ల స్వల్ప వెనకడుగుతో 37,288కు చేరగా.. నిఫ్టీ సైతం 17 పాయింట్లు క్షీణించి 11,000 వద్ద ట్రేడవుతోంది. అయితే తొలుత నిఫ్టీ 11,000 పాయింట్ల కీలక మార్క్‌ దిగువకు సైతం చేరింది. కాగా.. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ సమీక్షా వివరాలు మినిట్స్‌ ద్వారా నేడు వెల్లడికానున్నాయి. మరోపక్క రిజర్వ్‌ బ్యాంక్‌ గత పాలసీ సమావేశ చర్చల వివరాలు సైతం తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 

మెటల్స్‌ మెల్టింగ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 1.5-0.5 మధ్య శాతం డీలాపడగా.. ఐటీ, ఆటో 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, హిందాల్కో, వేదాంతా, బ్రిటానియా, ఇన్‌ఫ్రాటెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐబీ హౌసింగ్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌ 3-1 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఐషర్, ఎంఅండ్‌ఎం, మారుతీ, హీరో మోటో, అల్ట్రాటెక్, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా 2-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. 

బిర్లాసాఫ్ట్‌ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో బిర్లాసాఫ్ట్‌, యూబీఎల్‌, భెల్‌, అరవింద్‌, ఐడియా, రేమండ్‌ 5-2.6 శాతం మధ్య పతనంకాగా.. బయోకాన్‌, నెస్లే, రిలయన్స్‌ కేపిటల్‌, కంకార్‌, టాటా ఎలక్సీ, దివాన్‌ హౌసింగ్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, పీవీఆర్‌ 2.4-1.4 శాతం మధ్య పుంజుకున్నాయి. రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, సన్‌టెక్‌, శోభా, బ్రిగేడ్‌, మహీంద్రా లైఫ్‌ 3-1.25 శాతం మధ్య నీరసించాయి. 

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్ల బాటలో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.3 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 606 లాభపడగా.. 846 వెనకడుగులో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో సీజీ పవర్‌ 20 శాతం కుప్పకూలగా.. కెపాసైట్‌, కాన్ఫిడెన్స్‌ పెట్రో, గల్ఫ్‌ పెట్రో, హెచ్‌సీజీ, ఓరయింట్‌, జెట్‌ ఎయిర్‌, సరళా పాలీ, రుషిల్‌, సొమానీ తదితరాలు 13-4 శాతం మధ్య పతనమయ్యాయి. 



Most Popular