నేడు అటూఇటుగా ఓపెనింగ్‌?!

నేడు అటూఇటుగా ఓపెనింగ్‌?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అటూఇటుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 15 పాయింట్లు బలహీనపడి 11,042 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆర్థిక మందగమన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు సహాయక ప్యాకేజీలకు తెరతీయనున్న వార్తలతో సోమవారం వరుసగా రెండో రోజు అటు యూరప్‌, ఇటు అమెరికా మార్కెట్లు జోరందుకున్నాయి. అయితే సోమవారం దేశీయంగా తొలుత ఈ ప్రభావం కనిపించినప్పటికీ చివర్లో మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. దీంతో నేడు కూడా మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

చివరికి అక్కడక్కడే
ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో సోమవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 52 పాయింట్లు బలపడి 37,402 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 11,054 వద్ద ముగిసింది. కేంద్ర బ్యాంకుల సహాయక ప్యాకేజీలు, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి సానుకూల వార్తల నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ ప్టాక్‌ మార్కెట్లు తదుపరి మరింత జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీని అందుకుంది. ఇంట్రాడేలో 370 పాయింట్ల వరకూ ఎగసి 37,719కు చేరింది. ఇక నిఫ్టీ సైతం సెంచరీ చేసి 11,147 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,102 పాయింట్ల వద్ద, తదుపరి 10,970 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,121 పాయింట్ల వద్ద, తదుపరి 11,189 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 28,065, 27,945 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,388, 28,589 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దేశీ ఫండ్స్‌ దన్ను
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 306 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 386 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. ఇదే విధంగా వారాంతన సైతం ఎఫ్‌పీఐలు రూ. 1339 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1058 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.



Most Popular