సెన్సెక్స్‌ డబుల్‌- స్టిములస్‌ జోష్‌

సెన్సెక్స్‌ డబుల్‌- స్టిములస్‌ జోష్‌

ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో వారాంతాన యూరోపియన్‌, అమెరికన్‌ మార్కెట్లు ర్యాలీ చేయగా.. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ట్రెండ్‌ నెలకొంది. దేశీయంగానూ కేంద్ర ప్రభుత్వం ఇందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే కొనుగోళ్లకు తెరతీశారు. వెరసి ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. 234 పాయింట్లు ఎగసి 37,584కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 66 పాయింట్లు పుంజుకుని 11,114ను తాకింది. ప్రస్తుతం కాస్త వెనకడుగుతో సెన్సెక్స్‌ 132 పాయింట్లు పెరిగి 37,482 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు జమ చేసుకుని 11,086 వద్ద ట్రేడవుతున్నాయి.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. రియల్టీ, ఫార్మా, ఐటీ, బ్యాంక్స్‌ 1.3-0.65 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా, ఐబీ హౌసింగ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, సిప్లా, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, కొటక్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, మారుతీ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.7-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.

రియల్టీ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఇండిగో, ఒరాకిల్, పెట్రోనెట్‌, దివాన్‌ హౌసింగ్‌, సీమెన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌ 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే మరోవైపు ఉజ్జీవన్, ఐడియా, రిలయన్స్‌ కేపిటల్‌, బిర్లాసాఫ్ట్‌, ఈక్విటాస్‌, సన్‌ టీవీ, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, కెనరా బ్యాంక్‌ 3-0.75 శాతం మధ్య బలహీనపడ్డాయి. రియల్టీ కౌంటర్లలో బ్రిగేడ్‌, ప్రెస్టేజ్‌ 5.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఇండియాబుల్స్‌, సన్‌టెక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఒబెరాయ్‌, శోభా 1-0.5 శాతం మధ్య పెరిగాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్ల బాటలో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగుతున్నారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 827 లాభపడగా.. 413 వెనకడుగులో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఐనియోస్‌ 20 శాతం దూసుకెళ్లగా.. శివమ్‌, ఫోర్స్‌, జయంత్‌, సిగ్నిటీ, తాజ్‌ జీవీకే, జేకే అగ్రి, డెన్‌, డీఐఎల్‌, పటేల్‌, వాటర్‌బేస్‌, కంట్రోల్‌ ప్రింట్, ముంజాల్‌ ఆటో తదితరాలు 9-5 శాతం మధ్య జంప్‌చేశాయి.