ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 9 పాయింట్లు బలపడి 11,063 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆర్థిక మందగమన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జర్మన్‌ ప్రభుత్వం సహాయక ప్యాకేజీలకు తెరతీయనున్నట్లు ప్రకటించడంతో వారాంతాన అటు యూరప్‌, ఇటు అమెరికా మార్కెట్లు జోరందుకున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య ఆందోనలు కొనసాగుతుండడటంతో అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో నేడు దేశీయంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నదని, ఫలితంగా మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని భావిస్తున్నారు. 

డోజోన్స్‌ బాటలో
వారాంతాన నేలచూపుతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. నష్టాలను పూడ్చుకుని లాభాలలోకి ప్రవేశించాయి. ఆపై స్వల్ప ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 39 పాయింట్లు బలపడి 37,350 వద్ద నిలవగా.. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 11,048 వద్ద ముగిసింది. అయితే తొలుత సెన్సెక్స్‌ 330 పాయింట్లకుపైగా పతనమైంది. కనిష్టంగా 36,974కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 105 పాయింట్లు కోల్పోయి 10,924 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,958 పాయింట్ల వద్ద, తదుపరి 10,869 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,103 పాయింట్ల వద్ద, తదుపరి 11,158 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,875, 27,533 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,405, 28,593 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల వెనకడుగు
గురువారం ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1339 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1058 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1615 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు సైతం రూ. 1620 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే. 



Most Popular