విదేశీ అంశాలే ట్రెండ్‌కు చుక్కాని

విదేశీ అంశాలే ట్రెండ్‌కు చుక్కాని

ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల కీలక అంశాలు పెద్దగా లేనప్పటికీ.. విదేశీ పరిస్థితులే చుక్కాని కాగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ శుక్రవారం(23న) జాక్సన్‌ హోల్‌ వద్ద చేయనున్న ప్రసంగంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశముంది. వార్షిక సదస్సులో భాగంగా పావెల్‌ ఇకపై ఫెడ్‌ అనుసరించనున్న పరపతి విధానాలను ప్రస్తావించే వీలుంది. గత పాలసీ సమీక్ష సందర్భంగా పావెల్‌ వడ్డీ రేట్ల తగ్గింపు తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనంటూ స్పష్టం చేశారు. అయితే అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా  కనిపిస్తున్న ఆర్థిక మందగమన సంకేతాలు వంటి పరిస్థితుల ఫలితంగా ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపును కొనసాగించే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పలు విషయాలపై పావెల్‌ ప్రసంగం సంకేతాలను ఇవ్వనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

Image result for indian stock investors

మినిట్స్‌ కీలకం
అటు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌, ఇటు దేశీయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ గత పాలసీ సమీక్ష సందర్భంగా ప్రాధాన్యత ఇచ్చిన పలు కీలక అంశాల వివరాలు ఈ వారం మినిట్స్‌ ద్వారా వెల్లడికానున్నాయి. బుధవారం(21న) తొలుత ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడికానుండగా.. భారత కాలమానం ప్రకారం అదే రోజు రాత్రి మినిట్స్‌ను ఫెడ్‌ విడుదల చేయనుంది. గత పాలసీ సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ రెపో రేటులో 0.35 శాతం కోత పెట్టిన విషయం విదితమే. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 5.4 శాతానికి దిగివచ్చింది. ఇది దశాబ్ద కాలం కనిష్టంకాగా.. అంచనా వేసినట్లుగానే ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం పావు శాతంమేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 2.5-2.25 శాతం నుంచి 2.25-2 శాతానికి దిగివచ్చాయి. 

జర్మనీపై దృష్టి
ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తున్న ప్రభావాన్ని తప్పించుకునేందుకు జర్మన్‌ ప్రభుత్వం బ్యాలన్స్‌డ్‌ బడ్జెట్‌ విధానాలను విడనాడేందుకు సిద్ధమని వారాంతాన వార్తలు వెలువడ్డాయి. అవసరమైతే సహాయక ప్యాకేజీలకు దిగనున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో వారాంతాన 10ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ మూడేళ్ల కనిష్టం నుంచి కోలుకున్నాయి.  

ఇతర అంశాలూ..
విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారంకలో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు తదితర పలు ఇతర అంశాలు సైతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.