పతన బాటలో.. అన్ని రంగాలూ

పతన బాటలో.. అన్ని రంగాలూ

ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తూ బాండ్ల ఈల్డ్స్‌ పతనంకావడంతో రెండు రోజుల క్రితం అమెరికా స్టాక్‌ ఇండెక్స్‌ డోజోన్స్‌ 800 పాయింట్లు కుప్పకూలింది. గురువారం యూఎస్‌ మార్కెట్లు నామమాత్రంగా కోలుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు, ఆర్థిక మాంద్య ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా మార్కెట్లు ప్రారంభంలోనే నష్టాల బాట పట్టాయి. తొలుత సెన్సెక్స్‌ 330 పాయింట్లకుపైగా పతనమైంది. కనిష్టంగా 36,974కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 105 పాయింట్లు కోల్పోయి 10,924 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 191 పాయింట్లు క్షీణించి 37,120 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 53 పాయింట్లు నీరసించి 10,976 వద్ద కదులుతోంది. దశాబ్ద కాలం తదుపరి మళ్లీ ఆర్థిక మాంద్య ఆందోళనలు తలెత్తడంతో ఇటీవల ప్రపంచ మార్కెట్లు నీరసిస్తూ వస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మెటల్స్, ఆటో.. 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలపడ్డాయి. ప్రధానంగా మెటల్‌, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ, ఫార్మా 2.2-1 శాతం మధ్య బోర్లా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 8 శాతం కుప్పకూలగా.. వేదాంతా, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, విప్రో, ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా 3-1.4 శాతం మధ్య క్షీణించాయి. అయితే యూపీఎల్‌, యస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.7-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

ఐడీబీఐ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడీబీఐ 8 శాతం పతనంకాగా, నిట్‌ టెక్‌, గ్లెన్‌మార్క్‌, పీవీఆర్‌, అరవింద్‌, బిర్లాసాఫ్ట్‌, డిష్‌ టీవీ 3.5-2.25 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కాగా.. మరోవైపు  రిలయన్స్‌ కేపిటల్‌ 9 శాతం జంప్‌చేయగా.. సీఈఎస్‌సీ, అపోలో హాస్పిటల్స్‌,  ఐడియా, ఇంజినీర్స్‌, పిరమల్‌, ఇంద్రప్రస్థ, ముత్తూట్‌, మహానగర్‌ గ్యాస్‌ 5-2 శాతం మధ్య ఎగశాయి. 

చిన్నషేర్లు వీక్‌
మార్కెట్లు పతన బాటలో ట్రేడవుతున్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లలో అమ్మకాలు పెరిగాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇప్పటివరకూ 527 షేర్లు లాభపడగా.. 928 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో కైటెక్స్‌, సారేగామా, హెచ్‌సీజీ, సలసర్‌, ఐజీపీఎల్‌, గణేశ్‌, హెచ్‌పీఎల్‌, ఎస్సెల్‌ ప్రొ, హెచ్ఈజీ, స్పెషాలిటీ, ప్రాగ్జిస్‌, వీఎస్‌ఎస్‌ఎల్‌ తదితరాలు 11-5.5 శాతం మధ్య తిరోగమించాయి. 



Most Popular