సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?!

సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 51 పాయింట్లు ఎగసి 10,948 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు తొలుత నమోదైన భారీ నష్టాల నుంచి చివరికి కోలుకున్నాయి. వెరసి ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. గురువారం ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. బుధవారం చైనా దిగుమతులపై టారిఫ్‌ల విధింపును అమెరికా ప్రభుత్వం వాయిదా వేయడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. నేడు దేశీయంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నదని, ఫలితంగా మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ట్రిపుల్‌తో ముగింపు
బుధవారం సానుకూలంగా ప్రారంభమైన దేశీ మార్కెట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సెంచరీతో నిలిచింది. ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడం కూడా ఇందుకు సహకరించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 353 పాయింట్లు జంప్‌చేసి 37,311 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 103 పాయింట్లు జమ చేసుకుని 11,029 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,951 పాయింట్ల వద్ద, తదుపరి 10,872 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,093 పాయింట్ల వద్ద, తదుపరి 11,153 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,795, 27,571 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,175, 28,331 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
గురువారం ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1615 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. మరోపక్క దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 1620 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా..  మంగళవారం  ఎఫ్‌పీఐలు రూ. 638 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 201 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. బక్రీద్‌ నేపథ్యంలో సోమవారం మార్కెట్లు పనిచేయలేదు.



Most Popular