భారీ 'నష్టాల సారేగామా'.. జీఐసీ

భారీ 'నష్టాల సారేగామా'.. జీఐసీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగ కంపెనీ సారేగామా ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇక మరోవైపు ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో ఫలితాలు నిరాశ పరచడంతో ఎన్‌బీఎఫ్‌సీ.. జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కూ అమ్మకాల సెగ తగిలింది. ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ అమ్మకాకు ఎగబడటంతో భారీగా పతనమయ్యాయి. వివరాలు చూద్దాం..

సారేగామా ఇండియా 
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో ఆర్‌పీ గోయెంకా కంపెనీ సారేగామా ఇండియా రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ1లో రూ. 16 కోట్ల నికర లాభం ఆర్జించగా.. తాజా క్వార్టర్‌లో రూ. 1 కోటి నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 126 కోట్లకు  చేరింది. ఇబిటా మార్జిన్లు 3 శాతం నీరసించి 23 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో సారేగామా కౌంటర్లో అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు లేకపోవడంతో ఈ షేరు 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి ఎన్‌ఎస్‌ఈలో రూ. 101 కోల్పోయి రూ. 403 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం!

Image result for gic housing finance

జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో ప్రయివేట్‌ రంగ కంపెనీ జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 70 శాతం పడిపోయి రూ. 15 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం సైతం 27 శాతం తక్కువగా రూ. 68 కోట్లకు  చేరింది. ఈ కాలంలో వ్యయాలు రూ. 68 కోట్లమేర పెరిగి రూ. 292 కోట్లను తాకినట్లు కంపెనీ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు ట్రేడింగ్ ముగిసేసరికి ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం పతనమై రూ. 214 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 209 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది.Most Popular