బౌన్స్‌బ్యాక్‌- ట్రిపుల్‌తో ముగింపు

బౌన్స్‌బ్యాక్‌- ట్రిపుల్‌తో ముగింపు

వాణిజ్య వివాదాలకు తాత్కాలికంగా చెక్‌ పెడుతూ అమెరికా ప్రభుత్వం టారిఫ్‌ల విధింపును వాయిదా వేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్‌ వచ్చింది. దీంతో మంగళవారం అమెరికా మార్కెట్లు హైజంప్‌ చేయగా.. ఆసియాలోనూ అన్ని మార్కెట్లూ లాభపడ్డాయి. ఈ ప్రభావంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ మార్కెట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సెంచరీతో నిలిచింది. ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడం కూడా ఇందుకు సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 353 పాయింట్లు జంప్‌చేసి 37,311 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 103 పాయింట్లు జమ చేసుకుని 11,029 వద్ద స్థిరపడింది. దశాబ్ద కాలం తదుపరి మళ్లీ ఆర్థిక మాంద్య ఆందోళనలు తలెత్తడంతో సోమవారం ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే.

ఫార్మా డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, మెటల్‌, బ్యాంక్స్‌, ఆటో రంగాలు 2.8-1 శాతం మధ్య పుంజుకోగా.. ఫార్మా 1.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జీ, టాటా స్టీల్‌, వేదాంతా, యస్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, టెక్‌ మహీంద్రా 5-3 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్‌ ఫార్మా, ఐబీ హౌసింగ్‌ 5 శాతం చొప్పున పతనంకాగా.. విప్రో, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, బ్రిటానియా, కొటక్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌ 3-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఐడియా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా 14 శాతం దూసుకెళ్లగా.. జిందాల్‌ స్టీల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, డిష్‌ టీవీ, ఇండిగో, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, మణప్పురం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 9-5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క గ్లెన్‌మార్క్‌ 8 శాతం పతనంకాగా.. ఉజ్జీవన్‌, నాల్కో, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఒరాకిల్‌, బాలకృష్ణ, మైండ్‌ట్రీ 3.3-2 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు భారీ లాభాలతో ముగిసిన నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లలోనూ కొనుగోళ్లు నమోదయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.9-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. మొత్తం 1312 షేర్లు లాభపడగా.. 1162 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
సోమవారం బక్రీద్‌ సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. మంగళవారం నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 638 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మాత్రం రూ. 201 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. గత శుక్రవారం ఎఫ్‌పీఐలు రూటు మార్చి రూ. 204 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ సైతం రూ. 607 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.



Most Popular