Q1- గ్లెన్‌మార్క్‌ డీలా- అపోలో జోరు

Q1- గ్లెన్‌మార్క్‌ డీలా- అపోలో జోరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఏడాది(2019-20) క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించడంతో హెల్త్‌కేర్‌ సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఫలితంగా గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేరు అమ్మకాలతో కళతప్పగా.. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ కౌంటర్‌ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ నికర లాభం 53 శాతం క్షీణించి రూ. 109 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం వృద్ధితో రూ. 2323 కోట్లను తాకింది. నిర్వహణ లాభం స్వల్పంగా తగ్గి రూ. 342 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 1.3 శాతం నీరసించి 14.7 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో గ్లెన్‌మార్క్‌ ఫార్మా కౌంటర్‌ డీలా పడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7 శాతం పతనమై రూ.  386 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 380 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది.

అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ నికర లాభం రెట్టింపునకు ఎగసి రూ. 49 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పుంజుకుని రూ. 2572 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 56 శాతం పెరిగి రూ. 364 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 10.5 శాతం నుంచి 14.1 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 1411 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1445 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం గమనార్హం.



Most Popular